ఇక్కడ యుద్ధం.. ఢిల్లీలో దండాలు : డీకే అరుణ

by Shyam |
ఇక్కడ యుద్ధం.. ఢిల్లీలో దండాలు : డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా యుద్ధం చేస్తానని, ప్రాంతీయ పార్టీలను కూడగడతానని గంభీర ప్రకటనలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టారని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. దుబ్బాకలోనూ, జీహెచ్ఎంసీలోనూ ఓటర్లు ఇచ్చిన షాక్ నుంచి కేసీఆర్ ఇంకా తేరుకోలేదన్నారు. అధికారంలోకి రావడం కోసం ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిని గాలికొదిలేశారని, ఉద్యమ ఆకాంక్షలను సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబంపైనా, ఆయన పాలనపైనా ప్రజలకు విసుగు వచ్చిందని, రాష్ట్రం ఏర్పడిన నుంచి ఆ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ బాగుపడలేదన్నారు.

కేసీఆర్ నియంతృత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు దుబ్బాకలో, జీహెచ్ఎంసీలో ఇచ్చిన తీర్పునే ఇకపైన అన్ని సందర్భాల్లో ఇస్తారని, మూడేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అది బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని నమ్ముతున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు అంతం చేయడం ఖాయమన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అవినీతి కూపంలో కల్వకుంట్ల కుటుంబం తేలుతోందన్నారు. సర్పంచ్‌లు వారి గ్రామాలను అభివృద్ధి చేసుకోడానికి స్వంత పైసలు ఖర్చు చేస్తున్నారని, కనీసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల్ని కూడా చెల్లించలేకపోతోందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులే ఇప్పుడు గ్రామాలకు పనికొస్తున్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed