చంద్రబాబు ఎజెండాయే బీజేపీ అమలు చేస్తోంది: మంత్రి పేర్ని నాని

by srinivas |   ( Updated:2021-12-28 03:12:18.0  )
చంద్రబాబు ఎజెండాయే బీజేపీ అమలు చేస్తోంది: మంత్రి పేర్ని నాని
X

దిశ, ఏపీ బ్యూరో : విజయవాడలో మంగళవారం జరగనున్న ప్రజాగ్రహ సభపై రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఒక ఎజెండా, సిద్ధాంతం అంటూ ఏమీ లేదని విమర్శించారు. చంద్రబాబు ఎజెండాను అమలు చేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తుందంటూ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ నేతలవి ఓట్ల రాజకీయాలే తప్ప ప్రజల కోసం కాదంటూ మండిపడ్డారు. ప్రజాగ్రహ సభ ఎందుకు పెడుతున్నారో బీజేపీకి అయినా క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు. ప్రజాగ్రహ సభ అంటూ పెద్ద ప్రహాసనానికి తెరలేపారు.

బీజేపీకి ఏపీలో ఒక ఎజెండా, ఒక సిద్ధాంతం, ప్రజా సమస్యలపై దృష్టి ఏమీలేవు. ప్రజలు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారు…? మీకు చంద్రబాబు ఎజెండా తప్ప మరో ఎజెండా ఉందా మీకు..? బీజేపీ అధికారంలోకి రాగానే బ్రాండీ బుడ్డి రూ.75 కే ఇస్తామని సిగ్గు లేకుండా చెప్తున్నారు. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే ప్రజాగ్రహ సభలో పెట్రోల్‌, డీజీల్‌ రేట్లపై మాట్లాడాలి అని మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్, ఎరువుల ధరలపై బీజేపీ నేతలకు మాట్లాడే ధైర్యం ఉందా? ఎక్కడ్నుంచో పిలుపు వస్తే.. ఇక్కడ సభ పెడతారా అంటూ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. 2014లో ఎరువుల బస్తా రూ.800 ఉంటే అది నేడు రూ.1700కి వెళ్ళింది. రైతుల ధాన్యం కొనమని కేంద్రం తెగేసి చెప్తోంది. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. వీటిపై బీజేపీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.

ధరలు నియంత్రణ చేయాల్సింది కేంద్రప్రభుత్వమే కదా అలాంటప్పుడు ఎందుకు రేట్లు తగ్గించడం లేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన అప్పులపై బీజేపీ నేతల రాద్ధాంతం చేయడం తగదన్నారు. ప్రతి పైసాకి లెక్క ఉంది. మేము జీఎస్ డీపీలో 3 శాతం లోపు అప్పు తెస్తే ఎందుకు గోల చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. జీడీపీలో 21 శాతం పైబడి అప్పు తెచ్చింది. దీనికి కారణం ఎవరు..? అని నిలదీశారు. మేము చట్టాలకు లోబడే అప్పులు చేస్తుంటే మీరెందుకు విమర్శలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలను మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు

Advertisement

Next Story

Most Viewed