- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ కార్పొరేషన్‌పై బీజేపీ ఫోకస్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జెండా ఎగరేసేందుకు బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. ఎన్నికల ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని, ప్రచార ఇన్‌చార్జిగా ఎంపీ అర్వింద్‌ను నియమించింది. మంత్రి కేటీఆర్ పర్యటనకు ముందే ఈ నిర్ణయం తీసుకోవడంతో ఓరుగల్లులో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.
దిశ ప్రతినిధి, వరంగల్: మరికొద్ది రోజుల్లో వరంగల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ముందస్తుగానే సన్నద్ధమవుతోంది. పార్టీ అధిష్ఠానం కార్యాచరణతో నాయకులు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతోంది. ఆరు నూరైనా.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుని కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేయాలనే కదనోత్సాహంతో కమలనాథులు కదులుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై..
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరగాల్సిన స్మార్ట్‌సిటీ, అమృత్‌తో పాటు ఇతర అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడాన్ని ప్రజలకు వివరిస్తూ టీఆర్‌ఎస్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో అధికార పార్టీ నేతలు సైతం కూడా జనక్షేత్రంలో ఇబ్బందిపడే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే వరంగల్ కార్పొరేషన్‌పై బీజేపీ నేతలు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎంపీ అర్వింద్‌తో పాటు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఇప్పటికే ఓసారి వరంగల్ చుట్టేసి వెళ్లి ముఖ్య నేతలకు ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరును సూచించినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగానే పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి వరంగల్ సమస్యలను ప్రస్తావిస్తూ నిత్యం జనక్షేత్రంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
కీలక నేతలకు ఎన్నికల బాధ్యతలు..
వరంగల్ కార్పొరేషన్ బీజేపీ ఎన్నికల ప్రచార ఇన్‌చార్జిగా ఎంపీ అర్వింద్‌కు అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లో తన వ్యూహాలతో గెలుపునకు కృషి చేసిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించింది. గతంలో రెండు సార్లు అర్వింద్ వరంగల్‌లో ఎంపీ హోదాలో పర్యటించారు. ఒకసారి అర్వింద్‌పై కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నించారు కూడా. ఈ సంఘటన తర్వాత వరంగల్ రాజకీయాలపై ఆయన ఎక్కువ శ్రద్ధ పెడుతుండడం విశేషం. ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడిన అర్వింద్‌కు ప్రచార బాధ్యతలను అధిష్ఠానం అప్పజెప్పింది. వరంగల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు మార్చి 14, 2021తో ముగియనుంది. ఈ లోపు ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు నెలలకు మించి సమయం లేదన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జనవరి 4న కేటీఆర్ పర్యటన..
వరంగల్ అర్బన్ జిల్లాలో జనవరి 4న ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కేటీఆర్ పర్యటనలో నిరసన గళం వినిపించాలని బీజేపీ సిద్ధమవుతోంది. మూడు నెలల క్రితం నగరం వరదల్లో నీట మునిగిన నేపథ్యంలో పట్టణాభివృద్ధికి సంబంధించి మంత్రి కేటీఆర్ అనేక హామీలిచ్చారు. నాలాల ఆక్రమణల కూల్చివేతతో పాటు లోతట్టు ప్రాంతాల అభివృద్ధికి ఆదేశాలిచ్చారు. అయితే ఇందులో చాలా వరకు అమలుకు నోచుకోలేదు. కేటీఆర్ హామీలు.. విడుదల చేసిన నిధులు.. జరిగిన అభివృద్ధి వంటి అంశాలపై ఇతిమిద్దంగా ప్రశ్నించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.
పక్కా ప్లానింగ్.. అంతా ఎన్నికల కోణమే!
బీజేపీ నేతలు రాష్ట్ర నాయకత్వం సూచనలతో పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నారు. ఇప్పటికే డివిజన్ల వారీగా కమిటీలు, ఇన్‌చార్జిల నియామకం జరిగింది. పార్టీలకు ఏఏ డివిజన్లు బలం కానున్నాయి.. ఎక్కడెక్కడ వీక్‌గా ఉన్నామనే విషయాలపై అంచనాకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ జాతీయ అధిష్ఠానం కూడా స్థానిక నేతలకు తెలియకుండా సర్వే చేయించినట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈసర్వేలో బీజేపీకి చాలా చోట్ల ఆశాజనకమైన ఫలితాలు వస్తాయని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోయినా బీజేపీ అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే వరంగల్‌లో అంతకుమించిన విజయం నమోదయ్యేలా పనిచేసేందుకు ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.