టీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదా..? షా టార్గెట్ ఆ ఇద్దరు మంత్రులేనా..?

by Anukaran |   ( Updated:2021-12-23 22:17:53.0  )
Amit Shah
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాబోయే ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్​చేస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహరచనకు ప్రణాళికలు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఉత్తరప్రదేశ్​ఎన్నికల అనంతరం దృష్టి మొత్తం తెలంగాణపైనే పెట్టాలని కేంద్ర అధిష్టానం యోచిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఇక్కడి బీజేపీ నేతల నుంచి తెలుసుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. వచ్చే ఎన్నికల్లో ఏం చేసైనా సరే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర నేతలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికోసం అమిత్​షా స్పెషల్​టీమ్‌ను తెలంగాణకు పంపిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇక్కడి వాస్తవ పరిస్థితులను అమిత్​షాకు ఎప్పటికప్పుడు అప్​డేట్​చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే అంశాలను సైతం వారు పరిశీలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేస్తానని అమిత్​షా బీజేపీ శ్రేణులకు చెప్పడంతో నేతల్లో జోష్​నిండినట్లయింది.

బీజేపీలో ట్రబుల్​షూటర్‌గా అమిత్​షాకు పేరుంది. అయితే ఇప్పుడు ఆయన ఫోకస్​తెలంగాణపై పడింది. ఎన్నికల్లో ఆయన ఎక్కడికి వెళ్లినా దాదాపు బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఆ రాష్ట్రాల్లో గెలుపు కోసం చేసిన వ్యూహరచనను ఇక్కడి వాస్తవ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణలోనూ తన సక్సెస్​ఫార్ములాను వాడనున్నారు. అయితే టీఆర్ఎస్​దూకుడుకు కళ్లెం వేయాలంటే ఎవరికి బ్రేక్​వేయాలా అనే ఆలోచనలో కేంద్రం పడింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కు ట్రబుల్​షూటర్‌గా పేరుపొందిన మంత్రి హరీశ్​రావు, కేటీఆర్‌కు చెక్​పెట్టేలా వ్యూహరచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్​చేసే విమర్శలను తిప్పి కొట్టేందుకు ఏడేళ్ల పాలనలో వారు చేస్తానని హామీలిచ్చి చేయని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్​షా ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. వరి కొనుగోలు వ్యవహారంలో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్‌ను వీక్​చేసేలా ప్లాన్​చేస్తున్నారు.

టీఆర్ఎస్​అధిష్టానం సగానికిపైగా స్థానాల్లో సిట్టింగ్​ఎమ్మెల్యేలను మార్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్​అధిష్టానం టికెట్​ఇవ్వదో.. ఆ స్థానాలపై బీజేపీ స్పెషల్​ఫోకస్​పెట్టింది. వారిని బీజేపీలోకి చేర్చుకునేలా మాస్టర్​ప్లాన్​వేసింది. ఒక్కొక్కరిగా ఇప్పటికే వివరాలను సేకరించాలని బేజేపీ నేతలకు అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అలాగే టీఆర్ఎస్​లోని అసంతృప్తులను, ఉద్యమకారులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ముఖ్యులను పార్టీలోకి చేర్చుకుని టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు టచ్‌లో ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్​చుగ్, హుజురాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ఇప్పటికే మీడియా సమావేశాల్లో స్పష్టం చేశారు. వీరేకాక రాష్ట్రం నుంచి ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్​ఎంపీలు సైతం బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు కేంద్ర నాయకత్వాన్ని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.​

ఆర్టీసీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఆనందంలో మహిళలు

Advertisement

Next Story

Most Viewed