కారు VS కమలం : హుజురాబాద్‌లో ఎత్తుకు పై ఎత్తులు

by Sridhar Babu |   ( Updated:2021-06-10 11:19:16.0  )
telangana political parties big fight in huzurabad bypolls
X

దిశ, కరీంనగర్ సిటీ : మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన శాసన సభ్యత్వ రాజీనామాకు ముందే ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఓ వైపు అధికార పార్టీ ఇప్పటికే తన మార్కు రాజకీయం ప్రారంభించగా, రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ నియోజకవర్గంపై భారతీయ జనతా పార్టీ కూడా తనదైన శైలిలో అడుగులు వేస్తోంది. కారును మరోసారి పరుగులు పెట్టించేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తులు వేస్తుండగా, కాషాయ జెండా రెపరెపల కోసం బీజేపీ పై ఎత్తులు వేయటం ఆరంభించింది. అక్కడ తమ కార్యకర్తలతో జాగృత కార్యక్రమాలు మొదలుపెట్టి కొనసాగిస్తోంది. బీజేపీలో ఈటల చేరిక లాంఛనమే కావటంతో ఆయన కండువా కప్పుకున్న అనంతరం, ఆపార్టీ అనుబంధ పరివారాన్ని రంగంలోకి దించేందుకు పక్కా వ్యూహం రచించింది.

ఇంకో వైపు ఈటల రెండు రోజులుగా సెగ్మెంట్లో తిరుగుతూ, అధికార తెరాస నేతలపై నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఎదులాపురం రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈటలకున్న వ్యక్తిగత బలానికి పార్టీ బలగం కూడా తొడుకానుండగా, భాజపా గెలుపు నల్లేరుమీద నడకలా మార్చేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈటల రాజీనామా అనంతరం రాబోయే ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమగ్రంగా చర్చించారు. రాజేందర్ అధికారికంగా చేరిన తర్వాత హుజురాబాద్‌లో గెలుపు కోసం పార్టీ అనుసరించాల్సిన ఎత్తగడలపై చర్చించి, ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

పార్టీ జాతీయ నాయకులను, కేంద్ర మంత్రులను కూడా రంగంలోకి దించి, తెరాస అవినీతి, అక్రమాలు, వాటిని ప్రశ్నిస్తే అధినేత తీసుకున్న నిర్ణయంపై ఈటలతో ప్రచారం చేయించి, సానుభూతి పొందేలా వ్యూహం రచించినట్లు సమాచారం. అలాగే, పలు రాష్ట్రాల్లో భాజపాపై విజయంలో కీలక పాత్ర పోషించిన వారిని కూడా రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం బీజేపీ ఆర్గనైజింగ్ సహ కార్యదర్శి, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన ప్రకాష్ జీ కూడా హైద్రాబాద్‌కు రానున్నారు. హుజురాబాద్ పరిస్థితిని సునిశితంగా పరిశీలించి, అంచనా వేసి ఇక్కడ చేపట్టాల్సిన కార్యాక్రమాలపై ఆయన రాష్ట్ర పార్టీకి స్కెచ్ ఇవ్వనున్నారు. ఈటల రాజేందర్ జాయినింగ్ అనంతరం ఢిల్లీ స్థాయి నాయకులు స్థానికంగా మకాం వేసి ఎప్పటికప్పుడు టీఆరెఎస్ ఎత్తులను చిత్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story