టార్గెట్ తెలియకుండా బరిలోకి దిగారు.. చివరకు ఓడారు

by  |
టార్గెట్ తెలియకుండా బరిలోకి దిగారు.. చివరకు ఓడారు
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ అంటే చాలా సింపుల్.. మొదట ఒక జట్టు టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. రెండో జట్టు దాన్ని ఛేదించడానికి బరిలోకి దిగుతుంది. అయితే మంగళవారం న్యూజీలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ20లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. అసలు టార్గెట్ ఎంతో తెలియకుండానే బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. విషయం తెలిసిన అంపైర్లు 1.3 ఓవర్ల తర్వాత మ్యాచ్ నిలిపివేశారు. అసలేం జరిగిందంటే.. టాస్ ఓడి న్యూజీలాండ్ బ్యాటింగ్ చేసింది. 17.5 ఓవర్లకు 173/5 స్కోర్ వద్ద భారీ వర్షం వచ్చింది. చాలా సేపు కురియడంతో న్యూజీలాండ్ ఇన్నింగ్స్ ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.

వెంటనే బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. వాస్తవానికి న్యూజీలాండ్ పూర్తి ఓవర్లు ఆడకపోవడం, వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడటంతో డక్‌వర్త్ లూయీస్ నియమం ప్రకారం మ్యాచ్ రిఫరీ టార్గెట్ మార్చాల్సి ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ జట్టు అవేవీ తెలుసుకోకుండా బ్యాటింగ్ ప్రారంభించింది. 1.3 ఓవర్లలో 12/0 స్కోర్ చేశాక రిఫరీ జెఫ్ క్రోవ్ మ్యాచ్‌ను నిలిపివేశాడు.

అసలు టార్గెట్ ఫిక్స్ చేయకుండా బ్యాట్స్‌మెన్‌ను ఎందుకు పంపారంటూ బంగ్లాదేశ్ కోచ్ రస్సెల్ డోమింగో‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు 16 ఓవర్లలో 171 టార్గెట్ అని ఫిక్స్ చేయడంతో తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. కాగా, బంగ్లాదేశ్ 16 ఓవర్లలో కేవలం 142/7 స్కోర్ చేసి ఓడిపోయింది. మరోవైపు అంపైర్ల పనితీరుపై కూడా రిఫరీ విచారణకు ఆదేశించారు. టార్గెట్ తెలియకుండా బంతులు ఎలా వేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story