ఆర్మీ హెలిక్టాపర్ క్రాష్.. బిపిన్ రావత్ పరిస్థితి విషమం?

by Anukaran |   ( Updated:2021-12-08 05:38:51.0  )
ఆర్మీ హెలిక్టాపర్ క్రాష్.. బిపిన్ రావత్ పరిస్థితి విషమం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశ సైనిక చరిత్రలోనే తొలిసారి అత్యంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత త్రివిధ దళాల అధిపతి(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ సీడీఎస్) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. బుధవారం మధ్యాహ్నం తమిళనాడులోని కోయంబత్తూరు కూనూరు మార్గంలో కాట్టేరి నంజప్పసత్రం సమీపంలో మిగ్ ఎంఐ-17వీఎఫ్‌ హెలికాప్టర్ కూలిపోయింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యూరిటీ కమెండోలు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మొత్తం 14 మంది ఉన్నారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో వెల్లడించింది.

ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారని తమిళనాడు మంత్రి అధికారికంగా ప్రకటించగా.. కాలినగాయాలతో గుర్తుపట్టడానికి వీలులేని పరిస్థితుల్లో 11మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని సైనిక వర్గాలు వెల్లడించాయి. మరో ముగ్గురు 80 శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో బయటపడ్డారు. వీరిలో బిపిన్ రావత్ ఉన్నట్లు అనధికార సమాచారం వస్తున్నది. వీరిని ఊటీ సమీపంలోని వెల్లింగ్టన్ మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని మిలిటరీ వర్గాలు తెలిపాయి. బిపిన్ రావత్, ఆయన భార్యకు ఎలా ఉంది? వారి పరిస్థితి ఏమిటి? అన్న విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

Next Story

Most Viewed