- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాచకొండ గుట్టల్లో.. భూ రాబందులు
దిశ, తెలంగాణ బ్యూరో: అందమైన లొకేషన్, రాచరికపు చారిత్రక ఆనవాళ్లు కలిగిన ప్రాంతం అంటూ అద్భుత ప్రపంచాన్ని చూపించి దశాబ్దాల క్రితమే అమ్మిన భూములవి. దందా అంతా ఆన్ లైన్, పేపర్ల మీదే నడిచింది. వెబ్ సైట్లు రూపొందించి అమ్మేశారు. ఆ తర్వాత వెంచర్లను డెవలప్ చేయలేదు. ప్లాట్లను కొనుగోలుదార్లకు అప్పగించలేదు. అంతకుమించి ఆ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే దందా నడిపించారు. కనీసం మ్యుటేషన్ కూడా చేయించుకోకపోవడంతో వారికి విక్రయించిన రైతుల పేర్ల మీదనే సదరు భూములు రెవెన్యూ రికార్డుల్లో కొనసాగాయి. వాటిని కొన్న వ్యక్తులెవరూ అందుబాటులో లేరు. ఇంకేముంది? అదే రాజకీయ నాయకులకు కలిసొచ్చింది. మళ్లీ పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతుల నుంచి అగ్గువ ధరలకే భూములను కొనుగోలు చేస్తున్నారు. ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు పలికే చోట రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకే కొనుగోలు చేస్తున్నారు. ప్లాట్లుగా కొనుగోలు చేసిన వందలాది మంది నోట్లో మట్టి కొడుతున్నారు. ఇది ఎక్కడో కాదు.. నగరానికి 40 కి.మీ దూరంలోనే జరుగుతోంది.
నేతల అనుచరులే.. రియల్టర్లుగా..
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం, రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని పలు గ్రామాల్లో రాజకీయ అండదండలు కలిగిన రియల్టర్లు రంగ ప్రవేశం చేశారు. ప్లాట్లుగా మారిన వందలాది ఎకరాలను మళ్లీ సాగు భూములుగా కొనుగోలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అధికార పార్టీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు, ఓ మాజీ ఎమ్మెల్సీ, ఓ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అనుచరగణం ఈ భూ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ తాము కొనుగోలు చేసిన ప్లాట్లు ఉన్నాయంటూ కొందరు సంస్థాన్ నారాయణపురం పోలీసుస్టేషన్లో సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. తమ దగ్గర సేల్ డీడ్లు ఉన్నాయంటూ ఆధారాలు చూపినా న్యాయం చేసేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ససేమిరా అంటున్నారు.
రాచకొండ గుట్టల్లో వ్యాపారం..
ఈ మధ్య కాలంలో రాచకొండ గుట్టల అందాలకు తోడు.. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో సినిమా సిటీ నిర్మిస్తామన్నారు. ఈ క్రమంలోనే భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దాంతో కొందరు రాజకీయ నాయకులు ప్రత్యక్ష్యంగా రంగంలోకి దిగారు. ఓ రాజ్యసభ సభ్యుడు, ఓ మాజీ ఎమ్మెల్సీ అనుచరులు 40 ఎకరాలను కొనుగోలు చేశారు. అయితే ఆ భూములు ఏనాడో ప్లాట్లుగా మారాయి. ఆ విషయం వారికి తెలుసు. కానీ రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేరిటే ఉండడంతో.. భూ రికార్డుల ప్రక్షాళనలోనూ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. వీటిని ఆధారంగా చేసుకొని భూ దందా నడిపిస్తున్నారు. పైగా కొనుగోలు చేసిన భూమి ఓ సర్వే నంబరులో ఉంటే, మరో సర్వే నంబరులో కబ్జా పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత ఓ మాజీ ఎమ్మెల్సీ అనుచరులు కొనగా.. వారు మరో రాజ్యసభ సభ్యుడి అనుచరులకు విక్రయించారు. మరో మాజీ జెడ్పీటీసీ సభ్యుడి అనుచరులు కూడా కొనుగోలు చేసినట్లు తెలిసింది.
ప్రక్షాళనలోనూ గుర్తించని అధికారులు..
2017లో సీఎం కేసీఆర్ భూ రికార్డుల ప్రక్షాళన చేయించారు. అందులో వ్యవసాయం, వ్యవసాయేతర ఆస్తులను గుర్తించాలి. కానీ రియల్ ఎస్టేట్లుగా మారిన భూములను కూడా వ్యవసాయంగా పరిగణించారు. లే అవుట్ల యజమానులు కొనుగోలు చేసిన భూములను మ్యుటేషన్ చేయించుకోకుండానే ప్లాట్లుగా చేసి విక్రయించారు. రికార్డుల్లో ఉన్న రైతుల పేరిట యథాతథంగా పేర్కొంటూ 1-బి పత్రాలను జారీ చేశారు. ప్రధానంగా నగర శివారులోని రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగింది. ప్లాట్లుగా కొనుగోలు చేసిన వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే రికార్డుల ప్రక్షాళనకు అర్థం లేకుండా పోతుందన్న ఆలోచన లేకుండా అధికారులు వ్యవహరించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహింపట్నం, రాజేంద్రనగర్, చేవెళ్ల, కల్వకుర్తి, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు, యాదాద్రి జిల్లాలో మునుగోడు, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలు రియల్ ఎస్టేట్లుగా మారాయి. ప్రక్షాళనలో వాటిని గుర్తించకుండా యథాతథంగా కొనసాగించారు. ఇప్పుడా అధికారుల నిర్లక్ష్యమే అధికార పార్టీకి చెందిన నాయకులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయినా సాగు భూములే..
రాచకొండ రెవెన్యూ పరిధిలో 1080 ఎకరాల వరకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకున్నారు. 500, 1000 గజాల వంతున ప్లాట్లు చేసి విక్రయించారు. నాలా కన్వర్షన్ చేసిన తర్వాత రికార్డుల్లో మార్పులు చేయాల్సిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించారు. ఈ భూములన్నీ ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే ఉంది. వీటిలో చాలా వరకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వ్యవసాయేతర భూములను గుర్తించకుండానే డేటాను అప్ లోడ్ చేశారు. అందుకే మ్యుటేషన్లకు నోచుకోని భూములను యథాతథంగా రూపొందించారు. దాంతో అమ్మిన రైతుల పేరిటే పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. రెవెన్యూ సిబ్బంది సహకారంతో కొందరు అధికార బలంతో కొనుగోళ్లు చేస్తున్నారు. భూములను చదును చేస్తున్నారు. ఫాంహౌజ్ లను నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఎవరి వైపు నిలుస్తారో వేచి చూడాలి.