జనసేన కార్యకర్తలు తాలిబాన్లు..

by Anukaran |
janasena
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన కార్యకర్తలు తాలిబన్లు అంటూ విమర్శించారు. భీమవరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఎవరైనా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే చాలు జనసేన కార్యకర్తలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క భీమవరంలోనే కాదు..రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందని ఆరోపించారు. జనసేన కార్యకర్తలకు, తాలిబన్లకు తేడా ఏమీలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాను కొత్తగా చెప్పడం లేదని ఇదే విషయాన్ని గతంలో అల్లు అర్జున్, నాగబాబు స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.

జనసేన నేతలు పిల్లచేష్టలకు పాల్పడుతున్నారంటూ గ్రంథి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తన గురించి జనసేన నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. భీమవరంలో అభివృద్ధి కుంటుపడింది అంటూ జనసేన పార్టీ నేతలు ఆ ఫ్లెక్సీలో పేర్కొనడంపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ భీమవరం ప్రజలకు కనిపించలేదని..ఆయన ఎందుకు కనిపించలేదన్న విషయాన్ని జనసేన కార్యకర్తలు ఓ బ్యానర్ వేసి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హితవు పలికారు.

Advertisement

Next Story