‘కేసీఆర్… నీ సంగతి తేలుస్తాం’

by Shyam |   ( Updated:2021-06-22 10:20:52.0  )
Batti Vikaramarka
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్.. ఇక నీ సంగతి తేలుస్తాం… ప్రజల బతుకులకు రక్షణ కల్పిస్తావా?.. లేక మా రక్షణ మేమే చూసుకోవాలా? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలి సమీపంలోని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రగల్భాల మాటలు, మాయమాటలు, మూడెరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు, సీఎంగా దళితుడిని చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అడుగడుగునా దళితులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పేద దళిత కుటుంబాల ప్రాణాలు, వారి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున మేము నిలబడతామని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ శాసనసభాపక్షాన ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఎంతవరకైనా పోరాడ్తాం.. న్యాయం జరిగే వరకూ ఏ స్థాయికైనా వెళ్లి పోరాటం చేస్తామని చెప్పారు. రోడ్ల మీదకు వచ్చి అయినా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఎంతకాలం ఇంకా ప్రాణాలు ఫణంగా పెట్టి శవాల మీద నీ రాజవైభోగాలు అనుభవిస్తావో తేల్చుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరారు. మానవహక్కుల కమిషన్ ను కలుస్తామని, గవర్నర్ కు లేఖ రాశామని స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ఉన్న వ్యవస్థలన్నీ కదలిస్తామని తెలిపారు.

ఇంకా మౌనంగా ఉండే శక్తి మాకు లేదని, తప్పనిసరిగా ఈ మౌనాన్ని ఛేదించాలని మానవ హక్కుల కోసం ఆలోచించే ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా.. ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవంతో, తల ఎత్తుకుని బతకడం కోసం ఈ తెలంగాణ తెచ్చుకున్నామని, ఇలా బలి పశువుల్లా మారిపోయి చనిపోవడానికి కాదన్నారు. మేధావుల్లారా ఆలోచించండని భట్టి కోరారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని దళితులు, గిరిజనులు, పేదవాళ్లపై గత ఏడేళ్ల నుంచి అనేక అకృత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రాష్ట్రంలో దళితులు బతికే హక్కు లేదా..? దళితుల ప్రాణాలకు విలువే లేదా? అని ప్రశ్నించారు. కేవలం రూ. రెండుల లక్షల దొంగతనం ఆరోపణలతో మరియమ్మ అనే దళిత మహిళను అన్యాయంగా, అతికిరాతకంగా కొట్టి చంపారని ఆరోపించారు. మరియమ్మను పోలీసులు కొడుతున్న సమయంలో ఆమె బిడ్డతన చంటిబిడ్డతో మా అమ్మను కొట్టకండి… చంపకండి అని కాళ్లమీదపడ్డా పోలీసులు కనికరించలేదని.. దళితులను కనీసం మనుషుల్లా చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ గత రెండు రోజులుగా పర్యటనలు, గుళ్లు, గోపురాలు, మీ వైభోగ యాత్రలు అన్ని చూస్తున్నామని, రెండు రోజుల నుంచి కనీసం ఒక్కదగ్గరైనా మరియమ్మ ఆర్తనాదాలు, మరణం గురించి మాట్లాడతారని ఆశించామని అన్నారు. ఉదయ్ కిరణ్ ఆర్తనాదాలు నీకు వినిపించి ఉంటాయని అనుకున్నామని.. వరంగల్ లో నువ్వు మాట్లాడుతూ.. ఇక దళిత సాధికారిత అంటే సిగ్గు అనిపిస్తోందని అన్నారు. సిరిసిల్లలో దళితులపై దాడులు, మంథనిలో రాజబాబు హత్య గురించి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని, హత్యాకాండ జరుగుతున్న సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం పాలన చూస్తుంటే ఈ రాష్ట్రంలో దళిత, గిరిజనుల ప్రాణాలకు విలువే లేదనిపిస్తోందని అన్నారు. మరియమ్మ మృతికి కారకులపై ఇప్పటికి అట్రాసిటీ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు.

Advertisement

Next Story