టెస్టులు పెంచాలి.. రాష్ట్రం ప్రమాదంలో పడింది: భట్టి

by Shyam |
టెస్టులు పెంచాలి.. రాష్ట్రం ప్రమాదంలో పడింది: భట్టి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా భయం గుప్పిట్లో ఉంటే సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే బాధేస్తోందని, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నానన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రతిరోజు 3,480 టెస్టులు మాత్రమే చేస్తున్నారని, అయినా పాజిటివ్ సంఖ్య ఎక్కువగా వస్తోందన్నారు. టెస్టుల సంఖ్య పెంచాలని, రాష్ట్రం ఇప్పుడు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, బెడ్ల ఖాళీ వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, హైదరాబాద్‌లోని హోటళ్లను కూడా స్వాధీనం చేసుకోవాలని భట్టి పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళితే కరోనా టెస్టులు చేసే వరకు వైద్యం చేయడం లేదని, పరీక్షల రిపోర్టులు వచ్చే వరకు ఐదారు రోజులు పడుతుందని, ఈలోగా వ్యాధి ముదిరి ప్రాణాలు పోతున్నాయన్నారు. సీజనల్ వ్యాధులకు వైద్యం చేసే పరిస్థితి కూడా లేదని, కరోనా పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వే చేసే శక్తి ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు కరోనా టెస్టులు చేయడం లేదని మండిపడ్డారు.

Advertisement

Next Story