‘బాబా కా దాబా’ను తలపిస్తున్న లిట్టి చోఖా

by Shyam |
litti-chokha
X

దిశ, ఫీచర్స్: ఢిల్లీలో వృద్ధ దంపతులు నడుపుతున్న ‘బాబా కా దాబా’ హోటల్ గురించి తెలిసే ఉంటుంది. కరోనా కారణంగా నష్టపోయిన ఆ వృద్ధులను ఆదుకోవాలని నెటిజన్లు పెట్టిన ఫొటోకు భారీ రెస్సాన్స్ రాగా, క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆ వృద్ధుడు ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు రోజుల నుంచి ముంబైలో ‘లిట్టి – చోఖా’ (బిహార్‌కు చెందిన వంటకం ఇది. గోధుమపిండితో చేసిన చపాతిలో పప్పులతో పాటు ఇతర మసాలాలను లిట్టిలో నింపి.. నిప్పులపై కాలుస్తారు) అమ్ముకునే చిరు వ్యాపారి యోగేష్‌కు సంబంధించిన పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది మొదలు పెట్టిన ‘ఫండ్‌ రైజింగ్‌ క్యాంపెయిన్‌’కు భారీ స్పందన లభిస్తోంది.

ముంబైకి చెందిన జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది.. ఇటీవలే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన యోగేష్ కథనం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఆ పోస్ట్ ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన యోగేశ్‌ ముంబైలోని వెర్సోవా బీచ్‌లో లిట్టి చోఖా అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అతను కేవలం రూ. 20లకే రెండు లిట్టీలు, చోఖా, చట్నీ, బటర్, సలాడ్ అందిస్తుండగా.. కరోనా కారణంగా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, దీంతో దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని ద్వివేదితో తన బాధను పంచుకున్నాడు. యోగేష్ పరిస్థితి చూసి చలించిపోయిన ద్వివేది.. ప్రస్తుతం ఇతని వ్యాపారం సరిగ్గా నడవడం లేదని, ఇతను తయారు చేసే పదార్థాలను జొమాటోలో అమ్ముకోవాలని అనుకుంటున్నాడని, అయితే ఎలా నమోదు చేసుకోవాలో యోగేష్‌కు తెలియదని వివరించాడు. వీలుంటే.. యోగేష్‌కు సాయం చేయాలని యూజర్లను కోరడంతో పాటు జొమాటోకు ట్యాగ్ చేశాడు. ఇలాంటి లిట్టి టేస్ట్ మీకు మరెక్కడా దొరకదని ద్వివేది తన పోస్ట్‌లో వివరించారు. మార్చి 16న పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌‌కు అనూహ్య స్పందన రాగా, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశాడు. అంతేకాదు చాలామంది నెటిజన్లు జొమాటోలో అతడి దుకాణాన్ని నమోదు చేయాలని రిక్వెస్ట్ చేశారు. దీనికి జొమాటో స్పందిస్తూ.. ‘ప్రియాన్షు రిప్లయ్ ఆలస్యం అయినందుకు క్షమించండి. వీలైతే, దయచేసి యోగేష్ కాంటాక్ట్‌ నంబర్‌తో పాటు ఇతర వివరాలను మాకు అందించండి’ అని కోరింది. వీరితో పాటు ఎంతోమంది నెటిజన్లు కూడా యోగేష్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Advertisement

Next Story