పండుటాకులకు పడిగాపులు

by Sridhar Babu |
pention1
X

దిశ, కరీంనగర్ సిటీ: ఈ ఫొటోలో ఉన్న వితంతువు జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన మహిళ. అసలే వృద్ధురాలు.. ఆపై భర్త లేని మహిళ. సంతానమున్నా ఎవరి కుటుంబాలు వారికి అయ్యాయి. గతంలో భర్తకొచ్చే పెన్షన్ తో ఇద్దరు బతికేవారు. మూడేళ్ల క్రితం భర్త చనిపోగా, పెన్షన్ నిలిచిపోయింది. తాను దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు అతీ గతీ లేదు. కన్నవారు దూరమై ఆదుకునే వారు లేక బతుకు భారమవుతుందని, పింఛన్ మంజూరు చేస్తే రోజుకో పూటైనా తింటూ, నిశ్చింతగా ఉంటానని కనిపించిన వారందరికీ మొర పెట్టుకుంటుంది. ఇది, ఒక్క రాదమ్మ బాధ మాత్రమే కాదు. జిల్లాలో వందలాది మందికి పైగా ఉన్న వితంతువుల పరిస్థితి కూడా ఇంతే. పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్నా ఎళ్లకేళ్లుగా పెండింగ్ లోనే ఉంటున్నాయి. వృద్ధాప్య పెన్షన్ల మంజూరీపై కూడా దిక్కు లేకుండా పోయింది. ఏళ్లకేళ్ళు గడుస్తున్నా దస్త్రం మాత్రం కదలక పోవటంతో, పండుటాకులకు పడిగాపులు తప్పడం లేదు. కొత్త పింఛన్ల విషయంలో సర్కారు ఇచ్చిన హామీ ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. ప్రకటన చేసి నెలలు గడస్తున్నా, ఇప్పటికీ సర్కారు నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇంకోవైపు పాత పింఛన్లకు కూడా ప్రతి నెలా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ప్రతి నెలా మొదటి వారంలోనే డబ్బులు పింఛన్ దారుల ఖాతాల్లో వేయాల్సి ఉండగా, చివరివారం వరకు వేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు రెండు, మూడు నెలలకు కలిపి వేస్తున్నారు.

మూడేళ్లుగా పెండింగ్లోనే కొత్త పెన్షన్లు

గతంలో రూ.1000 ఉండగా, దివ్యాంగులకు రూ .1500 చొప్పున ఇచ్చేవారు. తెలంగాణ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 2016, దివ్యాంగులకు రూ. 3016 చొప్పున అందజేస్తున్నారు. రాష్ట్రంలో 2018 నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో సుమారు 1,15,951 ఆసరా పింఛన్లు ఉండగా, కొత్తగా మరో 35 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రతి నెలా కొత్త దరఖాస్తులు వస్తున్నా అధికారులు ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నారు. కమిషనర్ స్థాయిలో అనుమతి ఇవ్వకపోవడంతో మూడేళ్లుగా పింఛన్లకు మోక్షం లభించలేదు.

57 ఏళ్లు నిండిన వారికీ పింఛన్లు

జిల్లాలో 27 వేలకుపైగా ఓఏపీ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక 57 ఏళ్లు దాటిన వారికి కూడా పింఛన్లు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించగా జాబితా సిద్ధం చేశారు. గతంలో 60 ఏళ్లున్నవారికే పింఛన్లు మంజూరీ చేయగా, తాజాగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కారు 57 ఏళ్లకు ఇస్తామని ప్రకటించగా, ఇటీవల 57 ఏళ్లు నిండిన వారి పింఛన్ల మంజూరుకు పచ్చజెండా ఊపారు. దీంతో ఇప్పటికే వీరంతా మీ – సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని మూడు నెలలు గడుస్తోంది. వీరికి పింఛను ఇచ్చే విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారంతా ఎదురు చూస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పెన్షన్ వయసు తగ్గిస్తూ ప్రకటన జారీ చేసింది. మంజూరీ విషయంలో స్పందించక పోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. పాత పింఛనుదారులకు కూడా కష్టాలు తప్పడం లేదు. గతంలో ప్రతి నెలా 5 వ తేదీలోపు డబ్బు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ప్రతి నెలా మూడు, నాలుగో వారంలో మాత్రమే జమ చేస్తున్నారు. దీంతో పండుటాకులకు ప్రతి నెల పడిగాపులు తప్పడం లేదు.

Advertisement

Next Story

Most Viewed