బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి.. కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే

by Aamani |   ( Updated:2021-07-16 07:02:40.0  )
Bellampalli MLA Durgam Chinnayya
X

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఎమ్మెల్యే చిన్నయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ల ఆశీస్సులు తీసుకొని, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి పట్టణంలోనే నిర్మించాలని, అందుకు బెల్లంపల్లి పట్టణంలో అనుకూలమైన వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలం మరియు గతంలో నిర్మించిన అసంపూర్తి భవనాలు ఉన్నాయన్నారు. అంతేగాకుండా.. సిబ్బందికి అవసరమయ్యే సింగరేణి క్వార్టర్స్ మరియు రవాణాకు అనుకూలమైన రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, నాలుగుదారుల రహదారి లాంటి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. బెల్లంపల్లి పట్టణం మంచిర్యాల, కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలకు మరియు మంచిర్యాల, చెన్నూరు, అసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యలో ఉంటుందని స్పష్టం చేశారు.

బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కళాశాల నిర్మిస్తే రెండు జిల్లాలకు అనుకూలంగా ఉండి 4 నియోజకవర్గాలకు కేంద్రబిందువుగా వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన మంత్రి కేటీఆర్‌కు వెల్లడించారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికగా మారిన మెడికల్ కాలేజీ పట్టణంలోని ఏర్పాటు కావడానికి మార్గం సుగమమైందని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed