ట్రంప్ పర్యటనలో భారత్‌కు లాభమేంటి?

by Shamantha N |
ట్రంప్ పర్యటనలో భారత్‌కు లాభమేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన మంగళవారం సాయంత్రంతో ముగిసింది. అసలు ట్రంప్ పర్యటన సందర్భంగా అమెరికా, భారత్‌ మధ్య జరిగిన ఒప్పందాలేమిటి? ఈ పర్యటన వల్ల భారత్‌కు ఏమైనా మేలు జరిగిందా? అన్నది ఓసారి పరిశీలిస్తే..
ట్రంప్ భారత్‌కు చేరుకున్న తొలిరోజు (సోమవారం) ఆయనకు స్వాగతం పలకడం, చారిత్రక ప్రదేశాలను సందర్శించడంతో ముగిసిపోయింది. అనంతరం నేడు(మంగళవారం) ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌‌లో మన ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్‌ల ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలూ 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2,155 కోట్లకు పైగా) రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. దీని ద్వారా ప్రపంచంలోనే అత్యాధునికమైన అపాచీ, ఎం.హెచ్-60 యుద్ధ హెలికాప్టర్లు సహా అడ్వాన్స్‌డ్ అమెరికన్ మిలటరీ పరికరాలు భారత రక్షణ రంగంలో చేరనున్నాయి. నాలుగు రంగాల్లో 70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50వేల కోట్లకు పైగా) ఒప్పందాలపై చర్చించినట్లు మోడీ, ట్రంప్‌లు తెలిపారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చించారు. చమురు సహకారం గురించి ప్రత్యేకంగా చర్చించామని వెల్లడించారు. ఈ ఒప్పందాలు ఇరుదేశాల ఉమ్మడి రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయనీ, అలాగే రక్షణ సహకారాన్ని పెంపొందించుకుంటాయని ట్రంప్ వెల్లడించారు. అలాగే, పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను నాశనం చేస్తామని తెలిపారు. అలాగే, భారత్, అమెరికాలు ఎనర్జీ సెక్టార్ సహా మూడు ఇతర అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇవి కాకుండా 5జీ సాంకేతికతపైనా చర్చించాయని తెలిపారు.
పౌల్ట్రీ, వ్యవసాయ, పాల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకే ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారని ముందు నుంచీ ఊహాగానాలు వ్యక్తమవ్వగా వీటికి సంబంధించిన ప్రస్తావనేది రాలేదు. రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధాలు చేరడం శుభపరిణామమే. అయితే, ఈ పర్యటనలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల జాబితా నుంచి తొలగించి, అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోకి చేరుస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ, అది జరగలేదు. ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పీఠం దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగానే అక్కడి ప్రవాస భారతీయులను, ముఖ్యంగా ప్రవాస గుజరాతీలను ఆకట్టుకునేందుకే భారత్‌లో పర్యటించారనే వాదన ఉంది. ఈ పర్యటన వల్ల భారత్‌ కన్నా ట్రంప్‌కే ఎక్కువ ప్రయోజనం కలిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టికల్ 370 భారత అంతర్గత విషమేనని చెప్పడం బాగానే ఉన్నా అవసరమైతే కశ్మీర్ అంశంపై పాక్, భారత్‌లకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ మరోసారి పాతపాటే పాడారు. అలాగే, కీలకమైన హెచ్1బీ విసాలపై ఎలాంటి స్పష్టతనూ ఇవ్వకపోవడం నిరాశ కలిగించేదే. తొలిరోజు మోడీని ఆకాశానికెత్తిన ట్రంప్ భారత్ అధిక సుంకాలు విధిస్తోందంటూ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. సుంకాల విషయంలో భారత్ ఒత్తిళ్లకు తలొగ్గబోమని తేల్చిచెప్పారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల ఓట్లు కొల్లగొట్టే యోచనలో భాగంగానే, అమెరికాలో హౌడీ మోడీ, భారత్‌లో నమస్తే ట్రంప్ పేరిట పర్యటనలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story