ఊపందుకున్న వరి కోతలు.. రైతన్నపై ఇంధన భారం

by Shyam |   ( Updated:2021-10-29 07:52:30.0  )
harvester
X

దిశ ప్రతినిధి, మెదక్: పంట వేసింది మొదలు కోతకోసే వరకు ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. కూలీల కొరత కారణంగా చాలామంది రైతులు వరి కోతలను హార్వేస్టర్ యంత్రాల ద్వారానే కోయిస్తున్నారు. హార్వేస్టర్ ద్వారా పంట కోయిస్తుండటంతో కూలీల కొరత, కోసే సమయం తగ్గినా.. ఖర్చులు మాత్రం తగ్గట్లేదు. డీజిల్ ధరలు పెరగడంతో హార్వేస్టర్ యజమానులు సైతం రేట్లను పెంచుతున్నారు. ఇది రైతుకు మోయలేని ఆర్థిక భారంగా మారింది.

ఊపందుకున్న వరి కోతలు

ఖరీఫ్ సీజన్‌లో పండించిన వరిపంట కోత దశకు వచ్చింది. గత నెలరోజుల నుండి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వరికోతలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం జలాల రాకతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరిసాగు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా సుమారు పది లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు అధికారులు చెబుతున్నారు. వరి కోతలు ప్రారంభం కావడంతో హార్వెస్టర్లన్నీ బిజీ అయ్యాయి. వరి కోయించడానికి రైతన్న వారం రోజుల పాటు వరి కోసే యంత్రం కోసం ఎదురుచూడాల్సి వస్తోందని రైతన్నలు చెబుతున్నారు.

రైతన్నపై ఇంధన భారం

ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. లీటర్ డీజిల్ ధర రూ.106 కు చేరింది. పెరిగిన డీజల్ ధరలతో కోతలకు ఉపయోగించే హార్వెస్టర్ అద్దె భారమవుతోంది. గతేడాది గంటకు వరి కోసేందుకు రూ.2,300 కాగా ప్రస్తుతం రూ.3 వేలకు చేరుకుంది. డిమాండ్‌ను బట్టి రూ.3,500 నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాకతో భూములన్నీ జాలువారాయి. పొలాల్లో తడి ఆరకపోవడంతో చైన్ హార్వెస్టర్లను ఉపయోగించాల్సి వస్తోంది. గతంలో ఎకరం పొలం కోయడానికి దాదాపు గంట సమయం పట్టేది. ఇప్పుడు భూమిలో తడి కారణంగా మరో అరగంట ఆలస్యమవుతోంది. ఇదికూడా రైతులకు భారంగా మారింది. దీనికితోడు కోసిన వరిని తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు సైతం ధరలను పెంచేశారు. ఒక్కో ట్రాక్టర్ డబ్బాకు గతంలో రూ.500 తీసుకోగా ప్రస్తుతం దాన్ని రూ. వెయ్యికి పెంచేశారు. అంటే మొత్తంగా ఒక్క ఎకరం వరి కోయించాలంటే హార్వెస్టర్, ట్రాక్టర్ ఖర్చులకు రూ.నాలుగైదు వేలు అవుతుంది. ఈ విషయమై హార్వెస్టర్ యజమానులను వివరణ కోరగా పెరిగిన డీజిల్ ధరలకనుగుణంగానే రేట్లను పెంచామని, డ్రైవర్ జీతం, డీజిల్ ఖర్చు, మిషన్ రిపేరు పోను తమకు ఏమీ మిగలడం లేదని చెబుతున్నారు.

కూలీల కొరత తగ్గినా.. ఖర్చులు తగ్గట్లేదు

జిల్లాలో అందరి పంటలు ఒకేసారి చేతికి రావడంతో కూలీల కొరత ఏర్పడింది. ఎప్పుడు వరి పంట కోయాలన్నా.. రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. గత కొన్నేండ్లుగా హార్వెస్టర్ యంత్రం రాకతో రైతులకు కూలీల ఇబ్బంది తప్పింది. కానీ, ఖర్చు మాత్రం భారీగా పెరిగింది. పెరిగిన ధరలకనుగుణంగా మద్దతు ధర తప్ప అన్ని రేట్లు పెరిగాయి. పెరిగిన డీజిల్ ధరలను సాకుగా చెప్పుకొని హార్వెస్టర్ యజమానులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారని, దీన్ని ప్రభుత్వం నియంత్రించాలని, అందరికీ ఒకటే రేటు వర్తించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story