- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెడ్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. ఆక్సిజన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో..
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ బెడ్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ ప్రకారం రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు 38 వేలకు పైగా బెడ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 22 వేలకు పైగా ఆక్సిజన్, ఐసీయూ బెడ్‌లే. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆక్సిజన్, ఐసీయూ బెడ్‌లతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ. బెడ్‌లను రెడీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అవసరమైన ఆక్సిజన్‌ను సమకూర్చడాన్ని మాత్రం గాలికొదిలేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల ఆక్సిజన్ గురించి మాత్రమే పట్టించుకుని ప్రైవేటు ఆస్పత్రుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో బెడ్‌లు ఉన్నా పేషెంట్లను చేర్చుకోడానికి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. చివరకు పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తాయి.
గతేడాది కరోనా తొలి వేవ్ సందర్భంగా పాజిటివ్ పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం పెద్దగా లేకపోయినా సెకండ్ వేవ్‌లో మాత్రం ఊహించనంతగా డిమాండ్ ఏర్పడింది. దాదాపు నాలుగైదు రెట్లు పెరిగినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు, ప్రధాన కార్యదర్శి పలు సందర్భాల్లో చెప్పారు. రోజుకు సగటున 600 టన్నుల వరకు ఆక్సిజన్ అవసరమవుతోందని, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 430 టన్నులను సమకూర్చుకోగలుగుతున్నామని వివరించారు. అయితే ఒడిషా నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ ద్వారా వస్తున్న ఆక్సిజన్‌లో ప్రభుత్వం ఎంత వాడుకుంటోంది, ప్రైవేటు రీఫిల్లింగ్ ఏజెంట్లకు ఎంత ఇస్తోందనే లెక్కలను మాత్రం అధికారులు వెల్లడించడంలేదు.
కొరవడిన సమన్వయం, నియంత్రణ
కరోనా పేషెంట్లను కాపాడడమే లక్ష్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లను రిజర్వు చేసిన ప్రభుత్వం దానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా గురించి మాత్రం బాధ్యత తీసుకోలేదు. అవసరాలకు తగినట్లుగా ఆక్సిజన్ కేటాయింపులు చేసే వ్యవస్థను నెలకొల్పలేకపోయింది. జిల్లా వైద్యాధికారుల ద్వారా ఏ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రికి ఎంత ఆక్సిజన్ అవసరమో, ఎంత మంది పేషెంట్లు ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ వార్డుల్లో ఉన్నారో లెక్కలు తీసుకుంటున్న ప్రభుత్వం ఆ మేరకు సరఫరా మాత్రం చేయలేకపోతోంది. ట్యాంకర్ల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ అందుతున్నా దాన్ని సిలిండర్లలోకి రీఫిల్ చేయడంలో ఉన్న అసౌకర్యాల కారణంగా ప్రైవేటు ఆస్పత్రులకు అందడంలేదు.
అనివార్యంగా ప్రైవేటు ఆస్పత్రులు వాటి పేషెంట్ల ఆక్సిజన్ అవసరాల కోసం డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, రీఫిల్లింగ్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం కోటాను నిర్దేశించినప్పటికీ ఆ మేరకు సరఫరా లేకపోవడంతో ప్రైవేటు ట్రేడర్లపై ఆధారపడుతున్నారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇంతకాలం ఆక్సిజన్ సిలిండర్ (44.7 లీటర్ల) ధర రూ. 275 ఉంటే ఇప్పుడు అది రూ. 4,000కు పెరిగింది. బెడ్ మీద ఉన్న పేషెంట్‌కు ఆక్సిజన్ అందించడం తప్పనిసరి కావడంతో ఎక్కువ ధరకు కొనక తప్పడంలేదు. ఆ భారాన్ని పేషెంట్ల బిల్లులో వేస్తున్నాయి. దీంతో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్ ఛార్జీ పెరుగుతోంది.
ఇతర రాష్ట్రాల నుంచి ట్యాంకర్ల ద్వారా సమకూర్చుకుంటున్న ఆక్సిజన్‌ను ప్రభుత్వం గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి, ఎంజీఎం తదితర సర్కారు ఆస్పత్రుల అవసరాలకు తగినంతగా సమకూర్చుకుంటోంది. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉన్నా బెడ్‌లు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లు ఎక్కువ సంఖ్యలో ఉన్నా అవసరానికి తగినంత ఆక్సిజన్‌ను సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఖాళీగా ఉంచేస్తున్నాయి. దీంతో అనివార్యంగా మళ్ళీ పాజిటివ్ పేషెంట్లు బెడ్‌లు దొరకడంలేదన్న కారణంగా ప్రభుత్వాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కానీ బెడ్‌లు దొరకకపోవడంతో అష్టకష్టాలు పడుతూ చివరకు ప్రాణాలొదులుతున్నారు.
మూడొంతుల పేషెంట్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే..
రాష్ట్రంలో మొత్తం 53 వేలకు పైగా సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ బెడ్‌లు ఉంటే అందులో 38 వేలకు పైగా 1138 ఆస్పత్రుల్లోనే ఉన్నాయి. ఇక ఆక్సిజన్ బెడ్‌లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడున్నర వేలు ఉంటే ప్రైవేటులో 13,250 దాకా ఉన్నాయి. ఐసీయూ బెడ్‌లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,170 ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో 9,180కు పైగా ఉన్నాయి. ఆక్సిజన్, వెంటిలేటర్ పేషెంట్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా ఉన్నా అవసరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో సీరియస్‌గా ఉన్న కొవిడ్ పేషెంట్లను సైతం చేర్చుకోవడంలేదు. బెడ్‌లు ఉన్నా ఆక్సిజన్ లేకపోవడంతో చివరకు మళ్ళీ ప్రభుత్వ ఆస్పత్రులపైనే ఒత్తిడి పెరుగుతోంది. ఆక్సిజన్ కొరత గురించి నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 టన్నులకు పైగా ఆక్సిజన్ మిగులులో ఉందని, సిలిండర్లను ఇండ్లలో ఉంచుకోవడం ద్వారా కొరత ఏర్పడుతోందన్నారు.
ఇదే విషయం గురించి పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఇండ్లలో ఉండిపోయిన సిలిండర్ల సంఖ్య ఎంతో తెలియదని, ఆ లెక్కలపై స్పష్టత లేదని, అందువల్లనే రీఫిల్లింగ్ కోసం వచ్చేవారి వివరాలన్నింటినీ సేకరిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం ఇటీవల రీఫిల్లింగ్ ఏజెంట్లతో పాటు ఆక్సిజన్ తయారుచేసే పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి రాష్ట్రంలో మొత్తం ఎన్ని సిలిండర్లు ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని రీఫిల్లింగ్ అయ్యాయి, ఎన్ని సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి తదితర వివరాలన్నింటినీ సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
ఆక్సిజన్‌కు కొరత లేకపోయినప్పటికీ నిర్దిష్టమైన మెకానిజాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం, సిలిండర్ల సంఖ్య అవసరాలకు తగినంతగా లేకపోవడం, పేషెంట్ల అవసరాలకు తగినట్లుగా సరఫరాను క్రమబద్ధీకరించకపోవడంతో కొరత ఏర్పడింది.
కేంద్రీకృత మెకానిజం అవసరం
“కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇవ్వడం కోసం కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లను కేటాయించిన ప్రభుత్వం ఆ అవసరాలకు తగినంతగా ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలేదు. బెడ్‌లు పుష్కలంగా ఉన్నా ఆక్సిజన్ లేకపోవడంతో అడ్మిషన్లు ఇవ్వలేకపోతున్నాం. చివరకు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. కానీ అక్కడ బెడ్‌లు లేకపోవడంతో అడ్మిషన్లు దొరకడంలేదు. ఫలితంగా పేషెంట్లను బతికించుకోలేకపోతున్నాం. ప్రభుత్వమే ఆక్సిజన్ సరఫరాను కూడా నియంత్రిస్తే మరణాలను నివారించవచ్చు. ఎక్కువ మంది పేషెంట్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించాలన్న బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని దానికి తగిన సరఫరాపై దృష్టి పెట్టాల’’.
-డాక్టర్ నర్సింగ్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మాజీ జాతీయ అధ్యక్షుడు