ఐపీఎల్ స్పాన్సర్‌గా వీవో.. బీసీసీఐపై ఒత్తిడి

by Shyam |
ఐపీఎల్ స్పాన్సర్‌గా వీవో.. బీసీసీఐపై ఒత్తిడి
X

దిశ, స్పోర్ట్స్: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు ఈ ఏడాది వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో పలు ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దయ్యాయి. ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాయిదా పడి ఎప్పుడు జరుగుతుందో లేదో తెలియని డోలాయమాన స్థితి. ఇలాంటి సమయంలో ఇండో-చైనా సైనికుల హింసాత్మక ఘర్షణ బీసీసీఐపైకి మళ్లింది. 20మంది సైనికుల మరణానికి కారణమైన చైనాకు తగిన బద్ధి చెప్పాలని పలువురు కోరుకుంటున్నారు. చైనా వస్తువులను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వీవోను వెంటనే తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ‘రోజురోజుకూ చైనా వస్తులపై నిషేధం విధించాలని వస్తున్న డిమాండ్లను తాము పరిశీలిస్తున్నామని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏవైనా మార్గదర్శకాలు విడుదల చేస్తే తప్పకుండా పాటిస్తాం’ అని పేరు తెలుపడానికి ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వీవోతో బీసీసీఐ ఐదేండ్లపాటు రూ.2199కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి సీజన్‌కు వీవో రూ. 440 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తున్నది. చైనాకు చెందిన ఈ మొబైల్ ఫోన్ బ్రాండ్‌తో వెంటనే బీసీసీఐ తెగతెంపులు చేసుకోవాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. బీసీసీఐకి స్పాన్సర్లుగా ఉన్న పేటీఎం, డ్రీమ్ ఎలెవెన్ కంపెనీల్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఐక్యూ00 స్మార్ట్ఫోన్ కూడా చైనాకు చెందిందే.

Advertisement

Next Story

Most Viewed