- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూఏఈలోనే ఐపీఎల్.. టీ20 వరల్డ్ కప్‌పై వీడని సందిగ్దం
దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 (IPL 2021 )లోని మిగిలిన మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. బీసీసీఐ అపెక్స్ కమిటీ సభ్యులు, ఇతర ఆఫీస్ బేరర్లు శనివారం వర్చువల్ పద్దతిలో జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐపీఎల్‌లోని మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ నిర్వహించాలని ప్రతిపాదించగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. సెప్టెంబర్ మూడో వారంలో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన ఐపీఎల్ 29 మ్యాచ్‌లు నిర్వహించిన అనంతరం మే 4న వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌లో యూఏఈ (UAE)వేదికగా నిర్వహించాలని భావించినా.. యూఏఈలో మైదానాలు ఖాళీగా లేకపోవడంతో పాటు.. భారత జట్టు డబ్ల్యూటీసీతో పాటు ఇంగ్లాండ్ జట్టుతో 5 టెస్టుల సిరీస్‌తో బిజీగా ఉండనున్నది. డబ్ల్యూటీసీ, ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లకు మధ్య నెలన్నర సమయం ఉన్నా.. యూఏఈలో ఆ సమయంలో ఇతర మ్యాచ్‌లతో మైదానాలు బిజీగా ఉన్నాయి. దీంతో సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి నిర్వహించడానికి బీసీసీఐ సిద్దపడింది.
కారణం కరోనా కాదు!!
ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా వాయిదా పడినా.. మిగిలిన మ్యాచ్‌లు యూఏఈలో నిర్వహించడానికి మాత్రం కరోనా కాదని బీసీసీఐ ప్రకటన ద్వారా తెలుస్తున్నది. సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో ఇండియాలో వాతావరణం క్రికెట్ ఆటకు అనుకూలంగా ఉండదు. ఆ సమయంలో రుతుపవనాలు చివరి దశకు చేరుకొని వర్షాలు పడుతుంటాయి. దీని వల్ల మ్యాచ్‌లకు ఆటంకం ఏర్పడవచ్చు. అందుకే మిగిలిన సీజన్‌ను యూఏఈ తరలిస్తున్నట్లు బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొన్నది. గత సీజన్ కూడా సెప్టెంబర్ 15 తర్వాతే ప్రారంభమైంది. కాబట్టి ఆ సమయంలో లీగ్ నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని బీసీసీఐ పెద్దలు భావించారు. అపెక్స్ కమిటీ ముందు కూడా ఇదే విషయం చర్చకు వచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇప్పటికే బీసీసీఐ ప్రతిపాదనకు ఓకే చెప్పడంతో లీగ్‌పై తుది నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు భేటీ అవుతారని.. ఆ తర్వాత 31 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నది. రద్దైన మ్యాచ్ నుంచే లీగ్ ప్రారంభమవుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
వరల్డ్ కప్‌పై సందిగ్దత..
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 Worldcup) షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి ఇండియా వేదికగా ప్రారంభం కావాలి. అయితే ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అసలు మెగా టోర్నీ ఇక్కడ జరుగుతుందా లేదా అనే సందిగ్దత నెలకొన్నది. దీనిపై బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. జూన్ 1న ఐసీసీ బోర్డు మీటింగ్‌లో టీ20 వరల్డ్ కప్ వేదిక సందిగ్దతపై చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో బీసీసీఐ తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతానికి టీ20 వరల్డ్ కప్ వేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని.. తమకు ఒక నెల సమయం ఇవ్వాలని బీసీసీఐ కోరనున్నది. బీసీసీఐ ప్రతినిధులు ఈ మేరకు ఐసీసీ సమావేశంలో తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నట్లు జై షా చెప్పారు.
ఐపీఎల్ పునఃప్రారంభ ప్రకటనలో కూడా ‘కరోనా మహమ్మారి కారణంగా’ అని మెన్షన్ చేయకపోవడానికి కారణం ఇదేనని తెలుస్తున్నది. కేవలం వాతావరణం అనుకూలంగా లేనందునే ఐపీఎల్ తరలించాము కాబట్టి టీ20 వరల్డ్ కప్‌కు ఆటంకం ఉండకపోవచ్చనే ఉద్దేశం వచ్చేలా బీసీసీఐ ప్రకటన చేసింది. అక్టోబర్ 3వ వారం తర్వాత ఇండియాలో చలి కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి.. క్రికెట్ మ్యాచ్‌లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఐసీసీ కనుక బీసీసీఐకి నెల రోజుల గడువు ఇస్తే.. ఈ లోగా కరోనా మహమ్మారి తీవ్రత ఎలా ఉన్నదో కూడా తెలిసి పోతుంది కాబట్టే బోర్డు టీ20 వరల్డ్ కప్‌పై నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది.