IPL కొత్త ఫ్రాంచైజీ ధర రూ. 2000 కోట్లు

by Anukaran |
IPL
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ మరోసారి తన ఖజానాలో వేల కోట్ల రూపాయలు వేసుకోవడానికి సిద్దపడుతున్నది. ఐపీఎల్ 2022 నుంచి కొత్తగా రెండు జట్లను లీగ్‌లో చేర్చడానికి గతంలోనే బీసీసీఐ అపెక్స్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ జులై నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మే నెలలోనే కొత్త ఫ్రాంచైజీల టెండర్లు ప్రక్రియ ముగించాల్సి ఉన్నది. అయితే కరోనా కారణంగా మే 4న ఐపీఎల్ అర్దాంతరంగా వాయిదా పడటంతో పాటు టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై బీసీసీఐ పూర్తి బిజీగా మారిపోయింది. దీంతో కొన్నాళ్ల పాటు కొత్త జట్ల వేలం ప్రక్రియను పక్కన పెట్టింది. కాగా, ఇప్పుడు ఐపీఎల్ 2021లో వాయిదా పడిన 31 మ్యాచ్‌ల నిర్వహణకు అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. దీంతో పాటు వరల్డ్ కప్ వేదికపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తగా చేర్చాలనుకుంటున్న జట్ల కోసం జులై నెలలో బిడ్డింగ్ ప్రారంభించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఒక్కో జట్టు కనీసం రూ. 2000 కోట్లు

ఐపీఎల్ 2022లో చేర్చాలనుకుంటున్న కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించిన టెండర్లు జులైలోనే ప్రారంభించి సెప్టెంబర్ తొలి వారం లోపు పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నది. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ. 2000 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. కొత్త జట్టు కొనుగోలుపై ఆసక్తిగా ఉన్న ఒక బడా కంపెనీ సీఈవో ఈ విషయాన్ని జాతీయ మీడియాతో పంచుకున్నారు. జులైలో బీసీసీఐ బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నదని.. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ. 2000 కోట్లుగా ఉండొచ్చని ఆయన తెలిపారు. ఈ టెండర్ల ప్రక్రియ కోసమే తాము చాలా రోజుల నుంచి వేచి ఉన్నామని.. మరో వారం పది రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉన్నట్లు మాకు కీలక సమాచారం అందిందని ఆయన తెలిపారు. అయితే ఒక్కో జట్టు ధర అంత భారీగా ఉండటంపై మార్కెట్ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, బీసీసీఐ అంత ధర నిర్ణయించడం వెనుక కారణాలు కూడా చాలా ఉన్నాయి.

అసలు కారణం అదే..

కొత్త ఫ్రాంచైజీల కనీస ధర రూ. 2000 కోట్లుగా ఉంటే.. బీసీసీఐ ఖాతాలో రూ. 4000 కోట్లు జమ అవుతాయి. ఇంత భారీ ధర నిర్ణయించడంపై బీసీసీఐ అధికారులు సమర్దించుకుంటున్నారు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 15 శాతం వాటాలను బ్రిటన్‌కు చెందిన రెండ్‌బర్డ్ క్యాపిటల్స్ పార్ట్‌నర్స్‌కు విక్రయించారు. ఈ క్యాపిటల్ ఇన్వెస్టర్లకు లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్, బోస్టన్ రెడ్‌సాక్స్ బేస్‌బాల్ జట్లలో కూడా వాటాలు ఉన్నాయి. 15 శాతం వాటాలు కొనుగోలు చేసే ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు మార్కెట్ విలువను లెక్కించగా రూ. 1900 కోట్లుగా తేల్చారు. ఐపీఎల్‌లో అత్యంత తక్కువ విలువైన రాజస్థాన్ రాయల్స్ జట్టు మార్కెట్ క్యాపిటలర్ రూ. 1900 కోట్లుగా ఉండటంతో చెన్నై, ముంబై వంటి ఫ్రాంచైజీల విలువ రూ. 2500 కోట్లకు పైనే ఉంటుందని బీసీసీఐ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కొత్త ఫ్రాంచైజీలకు కనీస ధరను రూ. 2000 కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇక వచ్చే ఏడాది నుంచి జట్లు పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా 60 నుంచి 72 వరకు పెరిగే అవకాశం ఉన్నది. దీంతో బ్రాడ్‌కాస్టర్ హక్కుల రేటు కూడా పెరుగుతుంది. దీని ద్వారా కూడా బీసీసీఐకి భారీ ఆదాయం సమకూరనున్నది. వచ్చే ఏడాది నుంచి ఫ్రాంచైజీల ఆదాయం కూడా 50 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ 2021 ముగిసే లోపే కొత్త జట్లను ప్రకటించే అకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story