బీసీసీఐకి ఎదురు దెబ్బ

by Shyam |
బీసీసీఐకి ఎదురు దెబ్బ
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ హక్కుల వివాదంలో డబ్ల్యూఎస్జీపై రెండు రోజుల క్రితమే బీసీసీఐ దావా గెలిచి రూ.850కోట్లు పరిహారంగా పొందింది. ఇది జరిగి రెండు రోజులైనా గడవక ముందే బోర్డుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ నుంచి డక్కన్ చార్జర్స్ జట్టును అర్ధాంతరంగా తొలగించినందుకు ఆ ఫ్రాంచైజీ మాతృ సంస్థకు రూ.4800కోట్లు పరిహారంగా చెల్లించాలని బాంబే హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్ శుక్రవారం బీసీసీఐని ఆదేశించారు. ఐపీఎల్‌ ప్రారంభంలో హైదరాబాద్ తరఫున డక్కన్ చార్జర్స్ ప్రాతినిధ్యం వహించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డక్కన్ క్రానికల్‌కు చెందిన ఫ్రాంచైజీ ఇది. 2012లో ఆర్థిక సమస్యల కారణంగా డక్కన్ చార్జర్స్‌ను విక్రయించాలని భావించింది. ఇందుకోసం వేలం నిర్వహణకు డీసీ యాజయాన్యం ప్రయత్నించింది. పీవీపీ వెంచర్స్ నుంచి ఒకే బిడ్ రావడంతో తిరస్కరించింది. ఈ ప్రయత్నాల్లో ఉండగానే 2012, సెప్టెంబర్‌లో డీసీ ఫ్రాంచైజీని బీసీసీఐ రద్దు చేసింది. ఆ జట్టులోని ఆటగాళ్లను వేలానికి పెట్టింది. అంతేకాకుండా డీసీ స్థానంలో సన్ టీవీ నెట్‌వర్క్‌కు కొత్త ఫ్రాంచైజీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. తమ ఫ్రాంచైజీని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారని డీసీ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, స్టే ఇవ్వలేదు. తమకు అన్యాయం జరిగిందని బాంబే హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ సీకే ఠక్కర్‌ను ఆర్బిట్రేటర్‌గా నియమించింది. డీసీకి అన్యాయం జరిగిందని, బీసీసీఐ నిబంధనలు పాటించలేదని గుర్తించిన జస్టిస్ సీకే ఠక్కర్ రూ.4800కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పారు. గతంలో కోచీ టస్కర్స్ విషయంలో కూడా ఆర్బిట్రేటర్ రూ.850కోట్లు చెల్లించాలని బీసీసీఐకి ఆదేశించినా ఇంతవరకు ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

Advertisement

Next Story