ఐపీఎల్‌లో కొత్త కండీషన్స్.. మ్యాచ్ టైమింగ్స్‌లో భారీ మార్పు

by Anukaran |
IPL
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆటగాళ్లందరూ ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు చేరుకుంటున్నారు. ఏప్రిల్ 9 నుంచి మొదటి విడత మ్యాచ్‌లు ముంబయి, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ – 2021కు సంబంధించిన నిబంధనలు బీసీసీఐ విడుదల చేసింది. ఇటీవల కాలంలో తీవ్రంగా చర్చనీయాంశం అయిన స్లో ఓవర్ రేట్, అంపైర్స్ కాల్, సాఫ్ట్ సిగ్నల్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఈ నిబంధనలు రూపొందించింది. ఇప్పటికే ఈ రూల్స్‌ను ఆయా ఫ్రాంచైజీలకు పంపించినట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని చెప్పింది. కాగా, బీసీసీఐ రూపొందించిన ఈ రూల్స్ కేవలం ఐపీఎల్ వరకు మాత్రమే వర్తిస్తాయి. టీమ్ ఇండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఐసీసీ నిబంధనలే వర్తిస్తాయని పేర్కొన్నది.

ఒక ఇన్నింగ్స్.. 90 నిమిషాలు

ఐపీఎల్ ప్రారంభంలో ప్రతీ మ్యాచ్ రాత్రి 8.00 గంటలకు మొదలయ్యేది. కానీ గత సీజన్ నుంచి మ్యాచ్‌లను రాత్రి 7.30 గంటలకు ప్రారంభిస్తున్నారు. అలాగే డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటే తొలి మ్యాచ్ సాయంత్రం 3.30 గంటలకు మొదలు పెడుతున్నారు. గతంలో ఒక ఇన్నింగ్స్ ముగియడానికి 90 నిమిషాలపైనే సమయం పట్టేది. ఒక్కోసారి 90వ నిమిషంలో 20వ ఓవర్ వేయడం మొదలు పెట్టే వాళ్లు. కానీ కొత్త నిబంధన ప్రకారం 90 నిమిషాల్లోపు మొత్తం ఇన్నింగ్స్ ముగించాలి. ఇందులో 85 నిమిషాలు ప్లేయింగ్ టైమ్ కాగా, మిగిలిన 5 నిమిషాలు స్ట్రాటజిక్ టైమ్ అవుట్ కోసం కేటాయించారు. దీని ప్రకారం ఒక్కో ఓవర్ రేట్ గంటకు 14.11గా ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఒకవేళ బౌలింగ్ జట్టు ఎలాంటి సమయం వృధా చేయకుండా ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తున్నా సరే.. బ్యాటింగ్ జట్టు బ్రేక్స్ తీసుకుంటుంటే ఫోర్త్ అంపైర్ వారిని హెచ్చరిస్తాడు. బ్యాటింగ్ జట్టు కెప్టెన్, టీమ్ మేనేజర్లకు ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అయినా సరే లేట్ చేస్తే మాత్రం క్రికెట్ రూల్స్ 12.7.3.4 ప్రకారం బ్యాటింగ్ జట్టుకు జరిమానా విధిస్తారని బీసీసీఐ పేర్కొన్నది.

సాఫ్ట్ సిగ్నల్.. అంపైర్స్ కాల్

ఇటీవల ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరిగిన సిరీస్‌లో సాఫ్ట్ సిగ్నల్, అంపైర్స్ కాల్‌పై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సాఫ్ట్ సిగ్నల్ ఒక అనవసరమైన నిబంధన అని కెప్టెన్ కోహ్లీ స్వయంగా పేర్కొన్నాడు. ఈ సిరీస్‌ను పరిశీలించిన అనంతరం బీసీసీఐ ఐపీఎల్‌లో నిబంధనలు మార్చింది. ఇకపై సాఫ్ట్ సిగ్నల్ నామమాత్రం కానుంది. కేవలం రికార్డు బుక్స్‌లో పరిగణలోకి తీసుకోవడానికి అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇస్తాడు తప్ప టీవీ అంపైర్ దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

అయితే సాఫ్ట్ సిగ్నల్ సందర్భంగా అంపైర్లు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. టీవీ అంపైర్ సహాయం తీసుకోవాలని ఫీల్డ్ అంపైర్లు భావిస్తే.. ముందుగా బౌలర్ వైపు ఉన్న అంపైర్ మాత్రమే టీవీ అంపైర్‌తో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే అంతకంటే ముందు ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు మాట్లాడుకున్న తర్వాతే బౌలర్ వైపు నిలబడిన అంపైర్.. టీవీ అంపైర్‌తో సంప్రదించాలి. తన వరకు వచ్చిన ఫెయిర్ క్యాచ్, అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్, బంప్ డెలివరీ వంటి నిర్ణయాలు టీవీ అంపైర్ పూర్తి టెక్నాలజీని ఉపయోగించుకొని తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. అంతకు ముందు ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాఫ్ట్ సిగ్నల్‌తో పని ఉండదు.

మరోవైపు అంపైర్స్ కాల్‌ను తొలగించడం లేదని బీసీసీఐ వెల్లడించింది. అది డీఆర్ఎస్‌తో ముడిపడిన విషయం కాబట్టి ప్రస్తుతానికి అంపైర్స్ కాల్ నిబంధనను కొనసాగిస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఒక షార్ట్ రన్ కాల్‌ను కూడా టీవీ అంపైర్ పరిధిలోకి తీసుకొని వచ్చింది. ఈ నిబంధనలు అన్నీ ఏప్రిల్ 1 నుంచి అమలులో ఉండబోతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed