టీఆర్ఎస్‌కు ఓట్లడిగే హక్కు లేదు :శ్రీనివాస్‌ గౌడ్

by Shyam |   ( Updated:2021-02-26 09:18:15.0  )
టీఆర్ఎస్‌కు ఓట్లడిగే హక్కు లేదు :శ్రీనివాస్‌ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికలు-బీసీలు’ అంశంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన శుక్రవారం విస్తృత సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ‘బీసీల ఓట్లు బీసీలకే’ నినాదంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 78 మంది కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారన్నారు. రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏ అగ్రకులానికీ బీసీలు వ్యతిరేకం కాదన్నారు. కానీ వారి ఆధిపత్యమే రాజ్యమేలుతోందన్నారు.

బీసీలు లేరు, గోసీలు లేరు అని సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని, ఆయనకు బీసీ సత్తా చూపి కీలెరిగి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. బీసీలంతా రమణకు మద్దతుగా నిలవాలని కోరారు. 40 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారన్నారు. రూ.5 భోజనం కేంద్రాలకు వస్తే నిరుద్యోగులు ఎంత మంది తింటున్నారో తెలుస్తుందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు పట్టభద్రులను ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని టీటీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రమణ అన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చాకే టీఆర్‌ఎస్ పోటీ చేయాలని అమరవీరుల కుటుంబాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే దక్కాయన్నారు. హామీలు నెరవేర్చకుండా ఎన్నికలకు వెళ్తే కేసీఆర్‌ను ప్రజలు చెప్పుతో కొడతారని, అమరుల తల్లిదండ్రుల శవాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్లి ప్రచారంలో పాల్గొనాలన్నారు. వెయ్యి మందికి పైగా అమరులయ్యారని సాక్షాత్తు కేసీఆర్ పార్లమెంట్‌లో చెప్పి అధికారంలోకి వచ్చాక 500 మంది అమరులకు మాత్రమే చేయూత నిచ్చారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed