బాధలో బతుకమ్మ.. కారణం బల్దియా

by Shyam |   ( Updated:2021-10-06 23:00:46.0  )
Bathukamma
X

దిశ, సిటీ బ్యూరో: మహిళలు గొప్పగా జరుపుకునే బతుకమ్మ పండుగ. దసరా పండుగను పురస్కరించుకుని రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మను మంగళ గౌరిగా ఆరాధిస్తూ తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో కొల్చుకుంటూ నీటిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కానీ, ఈసారి బతుకమ్మకు మహానగరంలో నిమజ్జన కష్టాలు వచ్చిపడ్డాయి. గత నెల 10 నుంచి 19వ తేదీ వరకు జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో ఆది దేవుడైన మహాగణపతి ప్రతిమలను నగరంలోని 25 బతుకమ్మ కుంటల్లోనే నిమజ్జనం చేసిన సంగతి తెల్సిందే! నిమజ్జనం చేస్తున్నా కొద్దీ విగ్రహాల శకలాలు, వ్యర్థాలను అప్పటికప్పుడే తొలగిస్తామని న్యాయస్థానానికి స్పష్టం చేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడి చెత్తను అక్కడే వదిలేశారు. వినాయక నిమజ్జనం జరిగి 26 రోజులు గడుస్తున్నా, బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని బతుకమ్మల నిమజ్జనం కోసం కుంటలను శుభ్రపర్చడం మరిచారు. చాలా ఆలస్యంగా కళ్లు తెరిచిన జీహెచ్ఎంసీ అధికారులు బతుకమ్మ పండుగ తొలిరోజైన బుధవారం ఉదయం కళ్లు తెరిచి, ఆగ మేఘాలపై కుంటలను శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఇందుకు జీహెచ్ఎంసీ వర్షకాలం వినియోగించే ఇన్‌స్టెంట్ రోడ్ రిపేర్ టీమ్(ఐఆర్‌టీ) బృందాలను, అలాగే ఎంటమాలజీ సిబ్బందితోపాటు అడ్డా‌కూలీలను బుధవారం ఉదయాన్నే ఎంగేజ్ చేసుకుని పనులు చేయిస్తున్నారు.

బతుకమ్మ పండుగ తొలి రోజైన బుధవారం సాయంత్రం ఏడు గంటల నుంచి హుస్సేన్‌సాగర్ రోటరీ పార్కు సమీపంలోని బతుకమ్మ కుంటలో గాంధీనగర్, కవాడీగూడ, బైబిల్ హౌజ్, కల్పనా థియేటర్ ప్రాంతాల నుంచి వందలాది మంది మహళలు బతుకమ్మలను నిమజ్జనం చేసే సమయానికి కూడా ఇక్కడి బతుకమ్మ కుంటలు చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లు, ఆచార వ్యవహారాలంటే బల్దియాకు ఏ మాత్రం గౌరవం లేదని దీంతో తేలిపోయింది. గ్రేటర్‌లోని సుమారు 25 బతుకమ్మ కుంటల పరిస్థితి దాదాపు ఇలాగే తయారైంది. వినాయక నిమజ్జనం ముగిసిన తర్వాత అధికారులు వీటిని ఎందుకు శుభ్రం చేయలేదని మహానగర మహిళలు ప్రశ్నిస్తున్నారు. దాదాపు అన్ని కుంటల్లో చెత్తాచెదారం, విగ్రహాల శకలాలు, వ్యర్థాలు అలాగే ఉంటే సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని కోర్టుకు వెల్లడించిన బల్దియా అధికారులు, ఆ చెత్తాచెదారాన్ని ఎక్కడి నుంచి తీశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఓపీ, కెమికల్ విగ్రహాలను అసలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేది లేదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు అనుమతితో నిమజ్జనం చేసిన అధికారులు కోర్టును ఇలా తప్పుదోవపట్టించడాన్ని మహానగర ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కాగా, సకాలంలో వ్యర్థాలను తొలగించని అధికారులు తమ అలసత్వాన్ని బట్టబయలు కాకుండా వీలైనంత త్వరగా పనులు ముగించేందుకు వీలుగా 24/7 పనులు చేయాల్సిందేనని కార్మికులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

అవి బతుకమ్మ కుంటలే..
ప్రస్తుత సీఎస్ సోమేశ్‌ కుమార్ బల్దియా కమిషనర్‌గా ఉన్నప్పుడు బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు సుమారు రూ.10.61 కోట్ల వ్యయంతో గ్రేటర్‌లోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో 26 కుంటలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వీటిలో స్థల వివాదంతో పటాన్‌చెరులో కుంట ఏర్పాటు పనులు నిలిచిపోగా, మిగిలిన 25 కుంటలను అధికారులు పూర్తి చేశారు. వీటినే గణేశ్ నిమజ్జనానికి వినియోగించి, శుభ్రం చేయకుండా వదిలేయడంతో ఇప్పుడు తాము బతుకమ్మలను ఎక్కడ నిమజ్జనం చేయాలని మహానగర మహిళా లోకం ప్రశ్నిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed