- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ వైరస్‌లన్నింటికీ కారణం గబ్బిలాలా?
సార్స్, జికా, మెర్స్, ఎబోలా, ఇక ఇప్పుడు కరోనా… ఈ వైరస్‌లన్నీ ప్రపంచాన్ని వణికించాయి. ఇంకా వణికిస్తున్నాయి కూడా. వీటిని నివారించాలంటే ముందు ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలుసుకోవాలి. అది కొద్దిగా సులభమే. కానీ వీటి వ్యాప్తి ఎలా జరుగుతుందో కనిపెట్టి దాన్ని నివారించడమే చాలా కష్టమైన పని. అయితే ఇలాంటి వైరస్‌లు ఇంత త్వరగా వ్యాపించడానికి ప్రధాన కారణం గబ్బిలాలే అని పరిశోధకులు అంటున్నారు. బెర్క్లీ యూనివర్సిటీలో దీని గురించి చాలా పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనల్లో తేలిందేంటంటే గబ్బిలాలు ఈ వైరస్‌లను నిరోధించడమే కాకుండా వాటి ఎదుగుదలకు కారకాలు అవుతున్నాయట.
జలుబు, జ్వరాన్ని కలిగించే ఇలాంటి వైరస్‌లు గబ్బిలాన్ని సోకగానే వాటి వ్యాధి నిరోధక శక్తి ఉత్తేజితమవుతుంది. దీంతో వైరస్ పూర్తిస్థాయిలో గబ్బిలాన్ని ప్రభావితం చేయలేదు. కానీ దాని శరీరం మీదే ఉంటూ పరాన్నజీవిగా బతుకుతుంది. గబ్బిలం శరీరంలో ఉత్పత్తి అయిన ఫ్రీ రాడికల్స్ మీద ఆధారపడి వైరస్ తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటుంది. గబ్బిలం రాత్రిపూట ఎక్కువ దూరం సంచరించేజీవి కాబట్టి అది ప్రయాణించిన దూరం మొత్తం ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గబ్బిలాల స్థావరాలను చిందరవందర చేసినపుడు వైరస్‌ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
మనుషులకు, గబ్బిలాలకు జన్యుపరంగా ఎలాంటి సంబంధాలు లేవు. కాబట్టి అవి నిరోధించుకోగలిగిన వైరస్‌లు మనుషులకు, కోతులకు, ఇతర సాధారణ స్థాయి జంతువులకు ప్రాణాంతకంగా మారతాయి. అయితే గబ్బిలాలు ఏ రకంగా ఈ వైరస్‌లను కట్టడి చేస్తున్నాయో పరిశోధనల ద్వారా తెలుసుకోగలిగితే భవిష్యత్తులో ఇలాంటి వైరస్‌లు ప్రబలకుండా అరికట్టవచ్చని బెర్క్లీ శాస్త్రవేత్త బ్రూక్ అంటున్నారు.
ఇప్పటివరకు తాము చేసిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర అంశాలు తెలిశాయని బ్రూక్ వెల్లడించారు. గబ్బిలాలు ఎక్కువగా సంచరించే గుణం వల్ల జీవక్రియరేటు పెరిగి శారీరకంగా బలంగా ఉంటాయని ఆయన అన్నారు. జీవక్రియ రేటు అధికంగా ఉండటం వల్లే వైరస్‌ను తట్టుకోగల వ్యాధి నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుందని బ్రూక్ చెప్పారు. త్వరలోనే గబ్బిలం వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి పూర్తి మ్యాపింగ్‌ను డీకోడ్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.