ప్రోమోలు మొదలయ్యాయిగా!

by Sujitha Rachapalli |
ప్రోమోలు మొదలయ్యాయిగా!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఉండే క్రేజే వేరు. కానీ, ఈసారి బతుకమ్మ పండుగలో అంత ఆనందం ఉంటుందో లేదో తెలియదు. అయితే, అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి మార్పునకు లోనుకాకుండా ఒకటి మాత్రం జరుగుతోంది. అదే..బతుకమ్మ స్పెషల్ పాటల వీడియో షూటింగ్‌లు. డిజిటల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత గత ఐదారేండ్ల నుంచి బతుకమ్మ పాటలకు మంచి క్రేజ్ వస్తోంది. వార్తా చానళ్లు ప్రారంభించిన ఈ ట్రెండ్, వైరల్‌గా మారింది. పాట బాగుంటే చాలు..క్షణాల్లో పాపులర్ అయిపోతోంది. ఈ పాపులారిటీని క్యాచ్ చేసుకోవడానికి కొన్ని యూట్యూబ్ చానళ్లు కూడా సొంతంగా బతుకమ్మ పాటలను నిర్మించి, విడుదల చేయడం మొదలుపెట్టాయి. మరి ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే ఆయా యూట్యూబ్ చానళ్లు ప్రోమోలను కూడా విడుదల చేశాయి.

ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సంస్కృతికి ఈ బతుకమ్మ పాటలే పునర్వైభవాన్ని తీసుకొచ్చాయనేది అక్షర సత్యం. పల్లెటూళ్లు, బతుకమ్మ పూలు, రంగు రంగు ఓణీల్లో ఆడపిల్లలు, బతుకమ్మ పేర్చే విధానంతోపాటు అంతరించిపోతున్నాయనుకున్న బతుకమ్మ పాటలకు ఈ వీడియోలు కొత్త జీవం పోస్తున్నాయి. ఇక ఈ బతుకమ్మ పాటల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంటున్న పల్లెటూరి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. జానపదాలకు ఆధునిక టచ్‌తో వీరి గొంతులో పలికిస్తూ, ఆ పాటకు స్టెప్పులు కట్టిస్తూ విడుదల చేసే ఈ బతుకమ్మ పాటలు తెలంగాణలోని ప్రతి ఇంటికి చేరుతాయి. ఏ డీజే
పెట్టినా ఇవే పాటలు వినిపిస్తున్నాయి కూడా. అయితే, ఈ పాటలను విమర్శిస్తున్నవారు కూడా ఉన్నారు.

కొత్తొక వింత, పాతొక రోత అన్నట్లుగా గత ఐదారేండ్ల నుంచి ఇలా కుప్పలు తెప్పలుగా బతుకమ్మ పాటలు వచ్చి పడుతుండటం, అన్నీ ఒకేలా అనిపించడం వీక్షకులను ఇబ్బంది పెడుతోంది. ఒకరిని చూసి ఒకరు కాపీ కొడుతున్నట్లుగా ఉండటంతో వాస్తవమైన పాటకు విలువ దక్కడం లేదు. ఎప్పుడు కొత్తదనం కోరుకునే వీక్షకుడు, ఇప్పుడు విడుదలవుతున్న బతుకమ్మ పాటలను ఒకదానితో మరొకదాన్ని పోల్చుకోలేకపోతున్నాడు. ఎందులో చూసినా.. అవే పొలాలు, అవే పూలు, అవే లంగా ఓణీలు అని పెదవి విరుస్తున్నాడు. బతుకమ్మ పాటల ట్రెండ్ అయిపోయింది..కొత్తగా ఏదైనా చేయండి అని గగ్గోలు పెడుతున్నాడు. ఇలా జరగడానికి కారణం లేకపోలేదు..ఒక్క బతుకమ్మ పాట ఫేమస్ అయింది కదా అని ఆ తర్వాత ప్రతి చిన్న పండుగకు పాటలు విడుదల చేయడం మొదలుపెట్టారు. ఇలా చేయడం వల్ల వీక్షకులు బోరుకొచ్చేశారు. అయితే, ఇక్కడ యూట్యూబ్ చానళ్లకు ప్లస్ పాయింట్ ఏంటంటే… పాట ఎలా ఉన్నా, పిక్చరైజేషన్ గొప్పగా ఉంటే మినిమం వ్యూస్ దొరుకుతున్నాయి. అదే బాగా పాపులర్ అయిన సింగర్‌ను పెట్టి తీస్తే పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చేస్తుంది. ఈ కమర్షియల్ ఫార్ములాను అమలు చేయడంలో భాగంగా బతుకమ్మ పాటను నిర్మిస్తున్నారు. ఏదేమైనా బతుకమ్మ పాటల వల్ల ఎన్నారైలు తమ రాష్ట్రం, సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం కలుగుతోంది, అది చాలు మనకి!

Advertisement

Next Story

Most Viewed