బరోడా టీమ్ నుంచి తప్పుకున్న దీపక్ హుడా

by Harish |
బరోడా టీమ్ నుంచి తప్పుకున్న దీపక్ హుడా
X

దిశ, స్పోర్ట్స్ : దేశంలో కరోనా మహమ్మారి లాక్‌డౌన్ తర్వాత తొలి సారిగా దేశవాళీ క్రికెట్ ఆదివారం ప్రారంభమైంది. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందే బరోడా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కృనాల్ పాండ్యా, వైస్ కెప్టెన్ దీపక్ హుడాల మధ్య వివాదం చెలరేగింది. టీమ్ సభ్యులు, ఇతరుల ముందే పాండ్యా తనపై అకారణంగా నోరు పారేసుకున్నాడని.. అందరి ముందూ తన పరువు పోయిందని దీపక్ హుడా జట్టును వదిలేసి వెళ్లిపోయాడు. తాను ఎందుకు జట్టును వదిలి వెళ్తున్నాడో పూర్తి వివరాలను పేర్కొంటూ బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు హుడా ఈ-మెయిల్ పంపించాడు.

’11 ఏళ్లుగా బరోడా తరపున క్రికెట్ ఆడుతున్నాను. టీమ్ ఇండియాతో పాటు ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన సీనియర్ ఆటగాడిని. గతంలో బరోడా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను. బరోడా మేనేజ్‌మెంట్ తనను వైస్ కెప్టెన్‌ని చేసి కృనాల్‌ను కెప్టెన్‌గా చేశారు. అయినా తాను నిరాశ చెందలేదు. అయితే టీమ్ మీటింగ్స్‌లో కృనాల్ నా సలహాలను అసలు స్వీకరించడం లేదు. పైగా అవమానకరంగా మాట్లాడుతూ దూషిస్తున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని హుడా తన మెయిల్‌లో పేర్కొన్నాడు. కాగా, వీరిద్దరి గొడవపై నివేదిక ఇవ్వాలని టీమ్ మేనేజర్‌ను బరోడా క్రికెట్ అసోసియేషన్ ఆదేశించింది. మరోవైపు హుడా క్యాంప్ నుంచి వెళ్లిపోయాడు. తిరిగి జట్టులో చేరాలంటే కనీసం 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి.

Advertisement

Next Story

Most Viewed