- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వడ్డీ కిందికి రైతుబంధు!
“ నారాయణపేట జిల్లా సంగంబండ కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు ఐదెకరాల పొలానికి 2018లో మక్తల్ ఎస్బీఐలో రూ.లక్ష క్రాప్ లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ ఇప్పుడు లక్షకు రూ.20 వేల మిత్తి అయింది. ఐదెకరాలకు రూ.25వేల రైతుబంధు పడితే తీసుకుందామని బ్యాంకుకు వెళ్తే ఖాతా హోల్డ్‌లో పడిందని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఎందుకంటే క్రాప్ లోన్‌కు మిత్తి చెల్లించడం లేదంటున్నారు. ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పితే.. అవేం మాకు తెలియదు.. మిత్తీ కింద రైతుబంధుకు వచ్చిన డబ్బులను వాల్చుకున్నామని స్పష్టంగా చెప్పారు. క్రాప్ లోన్ కావాలంటే మళ్లీ ఇస్తాం.. కానీ ఇంకో పదివేలో, ఇరవై వేలో చెల్లిస్తే పాత లోన్‌ను తీసేసి కొత్త లోన్ ఇస్తామని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఆ అప్పు చెల్లించేదాకా ఖాతా హోల్డ్‌లోనే ఉంటుందని, రూపాయి పడినా క్రాప్ లోన్ రికవరీకి తీసుకుంటామని చెప్పడంతో సదరు రైతు వెనుదిరిగాడు.’’
“ నిర్మల్ జిల్లాలో ఓ బ్యాంకు మొత్తం రైతుల ఖాతాలను హోల్డ్‌లో పెట్టింది. సోన్ మండలంలోని ఇండియన్ బ్యాంకులో విలీనమైన అలహాబాద్ బ్యాంకు పరిధిలోని రైతుల ఖాతాల్లో నుంచి రూపాయి తీసుకోకుండా ఆంక్షలు పెట్టింది. అంతేకాకుండా వారసుల ఖాతాల్లో కూడా లావాదేవీలను ఆపేసింది. దీంతో రైతుబంధు జమ అయినా నగదు తీసుకోవడానికి బ్రేక్ పడింది. సోన్ మండలం గంజాల్ గ్రామానికి చెందిన జక్కా ముత్తవ్వ పేరుపై ఏడు ఎకరాల భూమి ఉండగా… రైతుబంధు సాయం ముత్తవ్వ ఖాతాలోనే పడింది. కానీ ముత్తవ్వ క్రాప్‌లోన్ రూపాయి తీసుకోకున్నా.. ఖాతాలో లావాదేవీలను నిలిపివేశారు. ఎందుకంటే అమె కొడుకులు క్రాప్ లోన్ తీసుకున్నారని, వడ్డీ చెల్లించడం లేదంటూ ఆపేశారు. ఇద్దరు కొడుకులు లోన్ చెల్లిస్తేనే ఖాతా నుంచి రైతుబంధు తీసుకునేందుకు ఛాన్స్ అంటూ బ్యాంకు సిబ్బంది చెప్పడంతో.. ఇద్దరు కొడుకులు బ్యాంకు లోన్ చెల్లించారు. ఆ తర్వాత ముత్తవ్వ ఖాతాను అన్‌హోల్డ్ చేశారు.’’
ఇదీ.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జరుగుతున్న తంతు. ఎందుకంటే రైతుబంధు సొమ్మును బ్యాంకులు విడుదల చేయడం లేదు. రైతులు తీసుకున్న క్రాప్ లోన్లకు ముడిపెట్టి రూపాయి ఇవ్వడం లేదు. కనీసం వడ్డీ వరకైనా చెల్లించాలంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పంట పెట్టుబడి సాయం రైతులకు చేరకుండా బ్యాంకులు అడ్డుపడుతున్నాయి. రైతుల ఖాతాలను ‘హోల్డ్’లో పెడుతున్నాయి. పంటల కోసం గతంలో తీసుకున్న అప్పులకు మిత్తి కింద జమ చేసుకుంటున్నాయి. రైతులు తీసుకున్న రూ.25 వేల లోపు అప్పులను ప్రభుత్వం మాఫీ చేసినా, ఆ నిధులు అందలేదని, వడ్డీ కూడా పెండింగ్లో ఉందని, పావలా వడ్డీ డబ్బులు ఇంకా రాలేదని.. ఇలా రకరకాల సాకులు చెబుతూ రైతుబంధు డబ్బులను తీసేసుకుంటున్నాయి. బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. పాత అప్పులను పూర్తిగా చెల్లిస్తేనే ఖాతా మళ్లీ ఓపెన్ అవుతుందంటూ బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. రైతుబంధు డబ్బులను ఆపరాదంటూ ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. మరో మార్గం లేక రైతులు పంట పెట్టుబడి కోసం మళ్లీ వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. వారు వందకు ఐదు రూపాయల చొప్పున వడ్డీని వసూలు చేస్తుంటారు. రుణాన్ని తీర్చాలంటే వడ్డీ అసలుకు రెట్టింపు స్థాయిలో చెల్లించాల్సి వస్తోంది. బ్యాంకుల్లో తక్కువ వడ్డీ ఉంటున్నందున రైతులు వాటిమీద ఆశలు పెట్టుకుంటారు.
ఈ ఏడాది రూ. 31,936 కోట్ల మేర పంట రుణాలను ఇవ్వాలని వార్షిక ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మొత్తం 21,145 కోట్లు ఇచ్చి చేతులెత్తేశారు. అయితే వీటిలో చాలా మంది రైతులకు తిరుగు లోన్లే ఎక్కువున్నాయి. అంటే పాత రుణానికి ఎంతో కొంత వడ్డీ తీసుకుని మళ్లీ దానిపైనే రుణాలు చెల్లించినట్లుగా చేస్తున్నారు. దీంతో రైతులకు ఐదు, పదివేలు ఎక్కువ ఇచ్చినట్టు చేస్తున్నా.. వడ్డీ కింద రెండింతలు తీసుకుంటున్నారు. మరోవైపు రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఆర్థిక శాఖ ఆ మేరకు నిధులను కూడా విడుదల చేసింది. కానీ, అది రైతులకు పెద్దగా ఉపశమనం కలిగించలేదు. పాత అప్పుల పేరు చెబుతూ బ్యాంకులు ఆ డబ్బులను జమ చేసుకుంటున్నాయి. రైతులు మళ్లీ అప్పు చేయక తప్పడం లేదు. పాత అప్పులు తీర్చకపోవడం, కరోనా కష్టకాలంలో ఆర్థిక లావాదేవీలు తగ్గిపోవడంతో కొత్త రుణాలను ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా లేవు.
గత మూడేళ్లుగా వార్షిక ప్రణాళికల మేరకు రుణాలు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నాయి. మరోవైపు పలు ప్రాంతాల్లోని రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు హోల్డ్‌లోనే ఉంది. లావాదేవీలన్నీ నిలిపివేశారు. ఈసారి కూడా లక్షల మంది రైతుల ఖాతాలు హోల్డ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం వడ్డీని చెల్లిస్తేనే ఆ ఖాతాలు మళ్లీ ఓపెన్ అవుతాయని, బ్యాంకుల నుంచే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటామని అంటున్నారు. రైతుబంధు సొమ్మును పాత అప్పులతో లింకు పెట్టవద్దని ప్రభుత్వం చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం బ్యాంకులకు సర్క్యులర్ ఇచ్చినా పరిగణలోకి తీసుకోవడం లేదు.
వార్షిక ప్రణాళిక ఉత్తిదే..
గడిచిన ఆరేళ్లలో బ్యాంకులు రైతులకు ఇవ్వాలనుకున్న పంట రుణాల లక్ష్యం, ఇచ్చిన రుణాల వివరాలను పరిశీలిస్తే పూర్తిస్థాయిలో రుణాలివ్వడం లేదు. ఏటా లక్ష్యం కంటే తక్కువ మొత్తంలోనే రుణాలు మంజూరు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ సంవత్సరం కూడా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ రూపొందించిన వార్షిక ప్రణాళిక ప్రకారం రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదు. అంతకు తక్కువగానే ఇస్తున్నాయి. మూడేళ్లుగా దాదాపు 25 శాతం నుంచి 33 శాతం మేరకు తక్కువ రుణాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. అయితే రైతులకు పంట రుణాలు ఆశించిన స్థాయిలో మంజూరు కావడం లేదని గతంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సిఫారసు చేసింది. కానీ రుణాల విడుదలలో మాత్రం అన్యాయమే చేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో రైతులకు రుణాలిచ్చినట్లు కేవలం రికార్డులకే పరిమితమవుతున్నాయి. అంటే పాత రుణాలకే తిరిగి కొత్త దరఖాస్తులను పెడుతున్నారు. వడ్డీ కింద రైతుబంధు సాయాన్ని చెల్లించుకుని, అంతే మొత్తాన్ని మళ్లీ రుణంగా ఇచ్చినట్లు లెక్కలేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
సంవత్సరం – లక్ష్యం ( రూ.కోట్లలో) మంజూరు (రూ. కోట్లలో)
2014-15 18,717 17,019
2015-16 27,800 20,585
2016-17 29,101 26,282
2017-18 39,752 31,414
2018-19 42,494 33,751
2019-20 48,470 38,000
2020-21 33,713 21,145
అప్పు కింద జమ చేసుకుంటున్నారు..
ఐదెకరాల భూమికి వచ్చిన రైతుబంధు సొమ్మును ఇవ్వడం లేదు. ఎందుకంటే మూడేండ్ల కిందట తీసుకున్న క్రాప్ లోన్ మిత్తీ పెరిగిందంటున్నారు. అందుకే ఖాతా హోల్డ్ లో ఉందని చెప్తున్నరు. దీంతో రైతుబంధు పైసలు రావడం లేదు. రైతుబంధు సొమ్ముకు ఇంకో ఐదు, పదివేలు చెల్లిస్తే ఖాతా ఓపెన్ చేసి కొత్తగా రుణం ఇస్తామంటున్నారు. అసలు పెట్టుబడులకు పైసల్లేవ్. ఇప్పుడు బ్యాంకు అప్పు ఎట్లా చెల్లించేది.
– శ్రీనివాస్‌రెడ్డి, సంగంబండ, నారాయణపేట జిల్లా