నెలలో నోటిఫికేషన్లు ఇవ్వాలి… బండి సంజయ్ హెచ్చరిక

by Shyam |
bandi sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగ, ఉపాధ్యాయుల రీఅలాట్ మెంట్ కోసం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుక్రవారం బండి బహిరంగ లేఖ రాశారు. ఈ జీవోతో ఉద్యోగులు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల స్థానికతను ప్రమాణికంగా తీసుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం సిగ్గుచేటని విమర్శలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా మూడేళ్లలోపు ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని 2018లో 124 జీవో జారీ చేసినా.. గడవు ముగిసేదాక సీఎం ఆ ఊసెత్తకపోవడం దారుణమన్నారు.

తీరా గడువు ముగిసే సమయానికి హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగులను మరింత గందరగోళంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడేసిందని దుయ్యబట్టారు. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, న్యాయ నిపుణులతో చర్చించకపోవడంపై బండి సంజయ్​ ఫైరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులను మరింత ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించకపోవడం సిగ్గుచేటని కేసీఆర్​ సర్కార్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలవ ల్ల భవిష్యత్తులో అనేక న్యాయపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని బండి వెల్లడించారు.

ఈ జీవోను యథాతథంగా అమలు చేస్తే పలు జిల్లాల్లో ఏళ్ల తరబడి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశమే లేకుండా పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న 317 జీవో అమలును తక్షణమే నిలిపివేయాలి ఆయన డిమాండ్ ​చేశారు. ఉద్యోగుల స్థానికత, సీనియారిటీ ఆధారంగా జిల్లాలకు సర్దుబాటు చేసే అంశంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలన్నారు. మొత్తం ఈ ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని బండి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. లేదంటే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదని బండి సంజయ్ ​హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed