బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’.. బీజేపీలో భిన్నస్వరాలు!

by Shyam |   ( Updated:2021-08-26 23:06:30.0  )
bandi-sanjay-padayatra
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఫస్ట్ ఫేజ్‌లో రెండు వారాలు మాత్రమే కొనసాగనుంది. రేపటి నుంచి(ఆగష్టు 28వ తేదీ) చేపట్టే పాదయాత్ర హైదరాబాద్ నుంచి మెదక్ వరకు మాత్రమే పరిమితం చేశారు. పాదయాత్రను ప్రకటించిన మొదట్లో హుజూరాబాద్ వరకు ఫస్ట్ ఫేజ్ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పిన కమిటీ సడన్‌గా ప్లాన్ మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న ‘దళితబంధు’పై పోరాటం చేస్తున్న క్రమంలో బీజేపీ ఈ అంశంపై ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై రాష్ట్ర నాయకుల్లోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఫస్ట్ ఫేజ్‌లో రెండు వారాలు మాత్రమే కొనసాగనుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన యాత్రను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నాయకులు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పక్కగా చేపడుతున్నారు. రేపటి(శనివారం) నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రకు అన్ని ఏర్పాట్లను బీజేపీ సిద్ధం చేశారు. యాత్ర కొనసాగే 14 రోజుల్లో ఏఏ ప్రాంతాల్లో ప్రసంగాలు చేపట్టాలి, భోజన సదుపాయాలు ఎక్కడ కల్పించాలి, రాత్రి బస ఎక్కడ చేయాలనే రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. చార్మినార్ దగ్గరి భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మెదక్ టౌన్ వరకు యాత్ర కొనసాగనుండగా ఈ నెల 10న మెదక్ టౌన్‌లో బండి సంజయ్ రాత్రి నిద్ర చేపట్టి మొదటి విడత పాదయాత్రను ముగించనున్నారు.

హుజూరాబాద్ వరకు అని చెప్పి ప్లాన్ మార్చిన కమిటీ:

రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉన్న హుజూరాబాద్‌లో పాదయాత్ర లేకపోవడంతో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఈ నెల 13న పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్మే రాజాసింగ్ మొదటి విడత పాదయాత్ర హుజూరాబాద్ వరకు కొనసాగుతుందని ప్రకటించారు. కానీ, షెడ్యూల్‌లో మాత్రం మెదక్ టౌన్ వరకు మాత్రమే మొదటి విడత పాదయాత్రను ప్రకటించడంతో ఈ యాత్రపై ఉన్న అంచనాలు తలకిందులవుతున్నాయి. ఈటల అనారోగ్య కారణంతో హుజూరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించలేకపోతున్నామని రాష్ట్ర నాయకులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటలను రాష్ట్ర నాయకులు పట్టించుకోవడం లేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

దళితబంధుపై పోరాటం చేయని బీజేపీ:

హుజూరాబాద్‌లో ప్రభుత్వం అమలు చేస్తోన్న ‘దళితబంధు’ పథకంపై బీజేపీ చెప్పుకోదగిన పోరాటాలు చేయకపోవడంతో పార్టీ రాష్ట్ర నాయకుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ‘దళితబంధు’లోని లోపాలను, అమలు చేసే విధానాన్ని, లబ్దిదారుల ఎంపికను విమర్శిస్తోన్న నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదు. హుజూరాబాద్‌లో పాదయాత్ర చేపట్టి పెద్దఎత్తున కార్యకర్తలతో తరలివెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎందుకు యాత్ర నిర్వహించడం లేదని కార్యకర్తలు చర్చించుకున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఈటలను ఒంటరిగా వదిలివేసారనే వాదనలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

Advertisement

Next Story