ఎమ్మెల్సీ బాలసానికి 'పార్టీ' పదవి..?

by Sridhar Babu |   ( Updated:2021-11-23 01:27:09.0  )
ఎమ్మెల్సీ బాలసానికి పార్టీ పదవి..?
X

దిశ, భద్రాచలం : ఖమ్మం సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు పార్టీలో కీలక పదవి లభించనుందని తెలుస్తోంది. ఆ మేరకు అధిష్టానం నుంచి హామీ లభించినట్లుగా సమాచారం. ఖమ్మం ఎమ్మెల్సీగా బాలసానికి మరో ఛాన్స్ దక్కుతుందని అందరు అనుకున్నారు. ఒకవేళ బాలసానికి ఛాన్స్ మిస్ అయితే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి లేదా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఛాన్స్ రావొచ్చని, ఆ ఇద్దరు కాకపోతే.. గాయత్రి రవి‌కి దక్కవచ్చని భావించారు. కానీ సీఎం కేసీఆర్ అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఈసారి ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుని తాతా మధుకి కేటాయించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. బాలసాని ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం జనవరి 4 వరకు ఉంది. ఈలోపు ఆయన తన రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేసుకోవాల్సి ఉంది. జాప్యం జరిగితే పదవుల కోసం నిరీక్షించే తుమ్మల, పొంగులేటిల జాబితాలోకి వెళ్ళక తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పార్టీ పదవి.. నామినేటెడ్ పోస్టుపైనే ఆశలు

ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకి రెండో సారి ఎమ్మెల్సీ అవకాశం చేజారడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బాలసాని కృషికి మెచ్చి కేసీఆర్ తగిన రీతిలో గుర్తింపు ఇస్తారని ఆశిస్తున్నారు.‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు కలిగిన బాలసానికి పార్టీకి సంబంధించిన కీలక పదవితో పాటు నామినేటెడ్ పోస్టు కూడా దక్కవచ్చని ఆయన అభిమానులు భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన బాలసాని సేవలు పార్టీకి ఎంతో అవసరమని ఆయన అభిమానులు అంటున్నారు. అంతేగాక భద్రాచలం అసెంబ్లీ సీటు వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే బాలసాని పాత్ర కీలకం అనేది నియోజకవర్గ పార్టీ శ్రేణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే బాలసానికి అనతి కాలంలోనే కీలక పదవి వస్తుందని టీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది.‌

Advertisement

Next Story

Most Viewed