బ్యాంకులకు బ్యాడ్‌లోన్స్ భయం!

by Shyam |
బ్యాంకులకు బ్యాడ్‌లోన్స్ భయం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్ బాగానే ఉంది..సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించడం వల్ల కలిగే నష్టాలను ఎలా ఎదుర్కోవడం అనే విషయంపై ఎక్కువగా ఆందోళన పడుతున్నది బ్యాంకులే. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్నీ నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో బ్యాంకుల వద్ద బ్యాడ్ లోన్స్ పెరిగే ప్రమాదముందని సీనియర్ ప్రభుత్వాధికారులు, టాప్ ఫోర్స్ బ్యాంకర్స్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ భారతీయ బ్యాంకులు రూ. 9.35 లక్షల కోట్ల రుణాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 2019, సెప్టెంబర్ నాటికి మొత్తం ఆస్తుల్లో రుణాలు 9.1 శాతంగా ఉన్నాయి.

ఉత్పత్తి లేక డిమాండ్ పడిపోతే…

ముఖ్యంగా రెడ్ జోన్‌గా ఉన్న నగరాల్లో జూన్, జూలై వరకూ ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశాల్లేవని, ఇది మరింత ఆందోళన కలిగించే అంశమని బ్యాంకర్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాల రుణాలు 20 శాతం వరకూ ఉన్నందున, వీటి ప్రభావం అధికంగా ఉండవచ్చునని తెలిపారు. దేశంలోని పది పెద్ద నగరాలే రెడ్ జోన్‌లో ఉండి ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయని వారు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ, చిన్న, మధ్య తరహా వ్యాపారాల ఉత్పత్తి లేక, డిమాండ్ క్షీణించి అవి నష్టాల్లోకి వెళ్తే, అవన్నీ నిరర్ధక ఆస్తులుగా మారే ప్రమాదముంది.

ఉద్దీపన ముఖ్యం..

దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతు.. సుమారు 83 శాతం క్రెడిట్స్ ఇచ్చే నగరాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే బ్యాంకుల రుణాల్లో 83 శాతం వాటాను ఇవి కలిగి ఉన్నాయి. కరోనా వైరస్ మొదలవకముందే భారత ఆర్థిక వ్యవస్థ మందగించినందున, ఇప్పుడు లాక్‌డౌన్ దెబ్బకు మరింత దెబ్బతినే అవకాశాలే ఎక్కువున్నాయంటున్నారు. సమర్థవంతమైన ఉద్దీపనలు ప్రభుత్వం నుంచే లేకుంటే పరిస్థితి దారుణంగా మారుతుందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు.

రెట్టింపు ఎన్‌పీఏలు…

ప్రభుత్వ అంచనాల ప్రకారం..ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకుల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 18 శాతం నుంచి 20 శాతానికి పెరిగే అవకాశముంది. ఎందుకంటే 20 శాతం నుంచి 25 శాతం బకాయిలున్న రుణాలు డిఫాల్ట్ అయ్యే ప్రమాదముందని చెబుతున్నారు. ఈ బ్యాడ్ లోన్స్ క్రెడిట్ గ్రోత్‌పైన కూడా ప్రభావం చూపిస్తుందని, కరోనా వ్యాప్తి వల్ల రికవరీకి కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. గతం కంటే రెట్టింపు స్థాయిలో నిరర్ధక ఆస్తులు పెరిగే ప్రమాదముందని అతిపెద్ద బ్యాంకుల అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అలాగనే ఒకేసారి తొలగించొద్దు…

లాక్‌డౌన్ జూన్ వరకూ గనక పొడిగిస్తే ఇండియా ఆర్థిక వ్యవస్థ దాదాపు 20 శాతం కుదించుకుపోవచ్చని మెకన్సీ అండ్ కో అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 2 శాతం నుంచి 3 శాతానికి పడిపోవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం రుణాలు 90 రోజుల గడువు తర్వాత నిరర్ధక ఆస్తులుగా గుర్తిస్తారు. అయితే, కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీన్ని 180 రోజులకు పెంచాలని చెబుతోంది. అలాగని లాక్‌డౌన్‌ను ఒక్కసారిగా ఎత్తివేస్తే మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోతామని మెకన్సీ అండ్ కో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags: Banks, coronavirus, coronavirus impact, indian banks, NPA, lockdown

Advertisement

Next Story