బాబ్లీ గేట్ల ఎత్తివేతకు ముహుర్తం ఖరారు

by Shyam |   ( Updated:2020-06-30 08:36:18.0  )
బాబ్లీ గేట్ల ఎత్తివేతకు ముహుర్తం ఖరారు
X

దిశ, నిజామాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను బుధవారం రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్, జలసంఘం సభ్యులు తెరువనున్నారు. గోదావరి నదిపై ఎగువ ప్రాంతంలోని మహా సర్కారు 78 వరకు భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించింది. దీంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా ఉన్న ఎస్సారెస్పీ ప్రశ్నార్థకంగా మారడంతో ఉమ్మడి రాష్ట్రంలోని నాటి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఇరు రాష్ట్రాల వాదనలు విన్న సుప్రీం ప్రతి ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లను తెరచి ఉంచాలని తీర్పునిచ్చింది. అయితే, ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు వచ్చిన నీరు ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతుంది. గతేడాది వర్షాలు లేక ఎస్సారెస్సీ డేడ్ స్టోరేజ్‌కి చేరింది.

ఎస్సారెస్పీలో 29 టీఎంసీలు..

ప్రస్తుతం ఎస్సారెస్సీలో 29.722 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మొత్తంగా 1070.4 అడుగుల నీటి నిలువ ఉండగా గతేడాది 1048.7 ఉన్నది. అనగా 5.508 టీఎంసీల నీటి నిలువ అన్నమాట. కాకతీయ కాలువ ద్వారా 50 క్యూసెక్యుల నీటిని ఖరీఫ్‌కు విడుదల చేస్తున్నట్లు ఏఈ జగదీష్ తెలిపారు. నీటి ఆవిరి రూపంలో 466 క్యూసెక్యుల నీరు, మిషన్ భగీరథ పథకం కింద కోరుట్ల, జగిత్యాల జిల్లాకు 41 క్యూసెక్యులు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు 42 క్యూసెక్కులు, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు 69 క్యూసెక్యుల నీటిని అందిస్తున్నట్లు వివరించారు. ఎస్సారెస్పీ నుంచి అవుట్ ప్లో 668 క్యూసెక్యులు వెళ్లుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న నీటితో వారాబంధీ ద్వారా మూడు తడుల ద్వారా ఎస్సారెస్పీ కాలువలకు ఖరీఫ్ నీళ్లు అందించే అవకాశం ఉంది.

బాబ్లీలో 0.62 టీఎంసీలు..

మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్‌లో 0.62 టీఎంసీల నీటి నిలువ ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 2.7 టీఎంసీలు. ఎగువ ప్రాంతంలోని గైక్వాడ్ ప్రాజెక్ట్ పూర్తిగా నిండిన తర్వాత బాబ్లీ ప్రాజెక్ట్‌లోకి గోదావరి జలాలను మహారాష్ట్ర వదులుతుంది. మహారాష్ట్రలో వర్షాలు అశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రాజెక్ట్‌లోకి నీరు వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. దీంతో కాళేశ్వరం నీటిపైనే ఎస్సారెస్పీ ఆధారపడి ఉంది. ఇప్పుడు ఉన్న నీటితో బాబ్లీ నుంచి నీళ్లు వచ్చే అవకాశాలు తక్కువే. బుధవారం బాబ్లీకి ఎస్సారెస్పీ ఇంజినీర్లతో పాటు హైదరాబాద్ నుంచి కేంద్ర జల సంఘం సభ్యులు బాబ్లీ ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. మహారాష్ట్ర అధికారులు, ఎస్సారెస్పీ అధికారులు కలిసి గేట్లను ఎత్తుతారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు జూలై 1 నుంచి ఆక్టోబర్ 28 వరకు ఈ గేట్లను ఎత్తి ఉంచుతారు. తర్వాత మార్చ్ 01న పశువుల తాగునీటికి 0.16 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed