ఖానాపూర్‌లో అటవీ భూములపై అవగాహన సదస్సు

by Shyam |   ( Updated:2021-11-05 08:28:34.0  )
ఖానాపూర్‌లో అటవీ భూములపై అవగాహన సదస్సు
X

దిశ, ఖానాపూర్: మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఆర్డీఓ పవన్ కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మోహన్ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులకు.. ఎంపీపీ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ, తహసీల్దార్‌ల సమక్షంలో అటవీ భూమి ఆర్వోఆర్‌పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు లబ్ధిదారుల ఎంపిక పట్ల అవలంభించాల్సిన నియమ నిభందనలు ప్రజాప్రతినిధులకు వివరించారు. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం భూమిపై హక్కుదారునికి సంక్రమించే అధికారాన్ని ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు.

మండల వ్యాప్తంగా అనేక గ్రామాలలో రైతులు కొన్ని దశాబ్దాలుగా అటవీ భూమిని సాగుచేసుకుంటున్నారు. కానీ, వారికి పట్టా హక్కుపత్రాలు లేకుండా రైతు బంధు, రైతు బీమా, రుణాలు పొందలేకపోతున్నారు. అనేక సంవత్సరాలుగా వీరు తమ సాగు భూములకి హక్కుదారులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యని తీరుస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విధి విధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలోనే అటవీ హక్కుల చట్టం 2006 ప్రామాణికంగా లబ్ధిదారులని ఎంపిక చేస్తున్నారు. హక్కుపత్రం రావాలంటే క్లెయిమ్ చేసే వ్యక్తి స్వానుభవంలో 13 డిసెంబర్, 2005‌కు ముందుగా భూమిని కలిగి ఉండాలి. ఆ భూమి విస్తీర్ణం 4 హెక్టర్లకి మించకుండా ఉండాలి. ఫారం ఏని పూర్తిచేసి దరఖాస్తుని మీసేవలో సమర్పించాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఇంటి పన్ను రశీదు, నివాస ధృవీకరణ పత్రాలు, పెద్దమనుషుల వాంగ్మూలం వంటి వాటిలో ఏదేని రెండు రుజువులు చూపించాల్సి ఉంటుంది. షెడ్యూల్ తెగలకి సంబంధించి తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి.

ఎంపిక ప్రక్రియ..

గ్రామాలు, ఆవాసాల్లో నివసిస్తున్న 10 నుంచి 15 వరకు సభ్యులను గ్రామ సభ ఎన్నుకుని, వారిచే అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. దీనిలో 2/3 వ వంతు ఎస్టీలు, 1/3 వ వంతు మహిళలు ఉండాలి. ఈ అటవీ హక్కుల కమిటీ క్లెయిమ్ దారుల నుంచి ఫారం ఏ దరఖాస్తులని తీసుకుని జాబితాని రూపొందించి.. హక్కుదారులు, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయికి వెళ్లి వ్యవసాయ భూమిని పరిశీలించాలి. ఈ విధంగా ఎఫ్‌ఆర్సీ రూపొందించిన జాబితాను గ్రామసభ ఆమోదించి లేదా తిరస్కరించి సబ్ డివిజినల్ స్థాయి కమిటీకి పంపిస్తారు. దీనికి గ్రామ సభలో కోరం 50% ఉండాలి.

సబ్ డివిజినల్ స్థాయి కమిటీ గ్రామ సభ తీర్మానం ఆమోదించి అటవీ హక్కుల రికార్డులని రూపొందిస్తుంది. దీనిపై తుది ఆమోదం కోసం జిల్లా స్థాయి కమిటీకి పంపిస్తుంది. జిల్లా స్థాయి కమిటీ దిగువ స్థాయిలో క్లెయిమ్‌లన్నీ పరిష్కరించారా లేదా అనేది పరిశీలిస్తుంది. తర్వాత అటవీ హక్కుల జాబితాని ఆమోదిస్తుంది. అటవీ హక్కుల ధృవీకరణ పత్రాలు, టైటిల్ కాపీని సంబంధిత హక్కుదారునికి, గ్రామ సభకి అందిస్తుంది. ఎవరైనా వ్యక్తి గ్రామ సభ తీర్మానం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లయితే తీర్మానం చేసిన రోజు నుండి 60 రోజుల లోపు సబ్ డివిజినల్ స్థాయి కమిటీ వద్ద అభ్యంతర వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేయవచ్చు.

చివరగా జిల్లా స్థాయి కమిటీ ఇచ్చే తుది నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. పైన తెలిపిన నిబంధనలు అందరు పాటించాలని, అటవీ భూమి పరిరక్షణకి అందరం కట్టుబడి ఉంటామని, ఒక్క అంగుళం కూడా ఆక్రమణకి గురి కాకుండా పాటు పడుతామని ఆర్డీఓ పవన్ కుమార్.. ప్రజాప్రతినిధులు, అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed