కరోనాపై ‘యమ’ ప్రచారం..

by Sridhar Babu |   ( Updated:2020-04-18 04:38:07.0  )
కరోనాపై ‘యమ’ ప్రచారం..
X

దిశ, కరీంనగర్: మాస్క్‌లు లేకుండా కరీంనగర్ రోడ్లపై వెళుతున్నవారిని ఓ వ్యక్తి అడ్డుకున్నారు. నీ పేరెంటీ..? ఏం చేస్తావు నీవు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. వారి ప్రశ్నలతో బిత్తరపోయిన ఆ వ్యక్తి గందరగోళానికి గురయ్యాడు. ఎవరు మీరు అంటూ ఎదురు ప్రశ్నించాడు. నేను యమపురి నుండి వచ్చిన యముడిని అంటూ సమాధానం ఇచ్చాడు. మాస్క్ లు లేకుండా రోడ్లపై తిరుగుతున్నావు కాబట్టి నీ ఆయుషు మూడింది.. నీవు యమపురికి రావాల్సిందే అంటూ ఆదేశించాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తిని పిలిచి ఏయ్ చిత్రగుప్తా ఇతని వివరాలు రాసుకో మాస్క్ లేకుండా తిరుగుతున్నాడు.. బ్రహ్మ రాసిన తలరాతను కాదని తన ప్రాణాలను పొగొట్టుకునేందుకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడంటూ ఆదేశించాడు. చిత్తం ప్రభూ అంటూ చిత్రగుప్తుడు చకచకా అతని వివరాలను రాసుకుంటున్నాడు. అసలెవరండీ మీరు ఎందుకిలా భయపెడుతున్నారంటూ ఆ పౌరుడు అడిగాడు. అప్పుడు ‘నాయన నేను యముడి వేషంలో ఉన్న కళాకారుడిని. కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కొల్పోతున్నామని తెలియదా…? జాగ్రతలు తీసుకుని బయటకు వెళ్లాలి కదా.. మాస్క్ లేకుండా బయటకు వస్తే ప్రాణాలకు ప్రమాదమన్న విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నావు’ అంటూ అతనికి క్లాస్ ఇచ్చాడు. ఇది కరీంనగర్ లోని పలు కూడళ్లలో సాక్షాత్కరించిన సన్నివేశం.

పోలీస్ కళాబృందం ప్రత్యేక కార్యక్రమం

కరీంనగర్ నగర వాసులకు మాస్క్ ల యొక్క ప్రాముఖ్యతను వివరించేందుకు పోలీస్ కళాబృందం ఏర్పాటు చేయించిన ఈ ప్రత్యేక కార్యక్రమం పలువురిని ఆకట్టుకున్నది.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లికి చెందిన మల్లయ్య అనే రిటైర్డ్ ఏఎస్సై తనలోని కళా ప్రదర్శనతో ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఆగస్టులోనే రిటైర్ అయిన మల్లయ్య చిన్ననాటి నుండే నాటకరంగంపై మక్కువ ఎక్కువ. అప్పటి నుండే కళా ప్రదర్శనలు ఇచ్చేవారు. పోలీస్ విభాగంలో చేరిన తరువాత ఓ చేత్తో లాఠీ పట్టుకుని మరో చేత్తో నాటకలాను ప్రదర్శిస్తూ కళామతల్లికి సమపాళ్లలో న్యాయం చేశారు. రిటైర్ అయిన కొద్ది రోజులకే ప్రపంచమంతా గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

నిన్న, మొన్నటి వరకు ఖాకీ యూనిఫాంతో నేరస్థుల ఆటకట్టించిన మల్లయ్య రిటైర్ అయిన తరువాత కూడా సమాజంలో మార్పు తీసుకరావాలన్న తపనను మాత్రం దూరం చేసుకోలేకపోయారు. దీంతో కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని తలచి తన మిత్రుడు కాంతయ్య సహకారంతో రోడ్లపై యముని వేషంలో అవగాహన కల్పిస్తున్నారు.

జగిత్యాల జిల్లాలో పలు చోట్ల కరోనాపై పలు కార్యక్రమాలు నిర్వహించిన మల్లయ్య గురించి తెలుసుకున్న కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ఆయనను కరీంనగర్ కు పిలిపించి ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రదర్శనలు ఇప్పించారు. అయితే మల్లయ్య మాత్రం ఎవరి నుండి ఆర్థిక సాయం తీసుకోకుండానే కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేస్తుండడం ఆదర్శనీయం

.tags:Awareness on corona, Karimnagar, Yamudu, Jagityala, Mallaiah, Karimnagar CP

Advertisement

Next Story

Most Viewed