- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటోవాలా.. బతుకు డీలా
దిశ, న్యూస్‌బ్యూరో : ఆటో నడిపి పూటగడిపే కార్మికుల జీవితాలను కరోనా కాటేసింది. వారి బతుకు చక్రం గాడి తప్పింది. కుటుంబాన్ని నడపడం గగనంగా మారింది. మూడున్నర నెలలు గడుస్తున్నా, అన్‌లాక్ వచ్చినా వారి బతుకుబండి మాత్రం కదలడం లేదు. వైరస్ భయంతో ఆటో ఎక్కేవారు కరువయ్యారు. దీంతో ఆటోలపై ఆధారపడే లక్షలాది మంది కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఇదే సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం, ఫైనాన్షియర్ల వేధింపులు ఎక్కువకావడంతో దిక్కుతోచని స్థితిలో కార్మికులు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు.
రాష్ట్ర నలుమూల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చినవారికి ఆటోలు పొట్ట నింపుతున్నాయి. ఏ ఉద్యోగం లేకపోయినా ఆటో నడిపి బతకవచ్చనే ధైర్యం ఇంతకాలం వారిని ముందుకు నడిపించింది. ఇప్పుడు కరోనా కష్టకాలంలో ఏ భరోసా లేకుండా పోయింది. నగరంలో సుమారు నాలుగు లక్షల మంది ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కరోనాతో సరుకురవాణా లేకపోవడం, స్కూళ్ళు మూతబడడం, లాక్‌డౌన్ కారణంగా రాకపోకలు తగ్గిపోవడం.. ఇలా అనేక వైపుల నుంచి వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో రోజుకు అన్ని ఖర్చులుపోనూ రూ. 800 వరకు మిగిలేవని, ఇప్పుడు రోజంతా కష్టపడ్డా రూ. 100 కూడా సంపాదించలేకపోతున్నామని కార్మికులు వాపోతున్నారు.
అన్నీ సమస్యలే..
నగరంలో రోజూ సగటున రెండు వేల కరోనా కేసులు వస్తుండడంతో ప్రజలు రోడ్ల మీదకు రావడానికి, ఆటో ఎక్కడానికి భయపడుతున్నారు. ఆటోలకు సర్కార్ సడలింపులు ఇచ్చినా గిరాకీ మాత్రం రావడం లేదు. దీనికి తోడు ఆటోలో ఇద్దరికంటే ఎక్కువగా ఎక్కించుకోరాదు, ఉల్లంఘిస్తే జరిమానా, శానిటైజర్ సప్లయ్ చేయాలి, వెనకవైపు కూర్చునేవారికి డ్రైవర్‌కు మధ్య ప్లాస్టిక్ షీట్ ఉండాలి లాంటి ఆంక్షలతో తమకు అదనపు ఖర్చు అవుతోందని వారు చెబుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. అద్దెకు తీసుకున్న ఆటోలకు కిరాయిలు కట్టుకోలేక, సొంత ఆటోలు ఉన్నావారు ప్రతినెలా ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు రుణ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోవడంతో ఫైనార్షియర్ల నుంచి వేధింపులు పెరిగాయని, అన్నీ సమస్యలే.. ఏం చేయాలో తోస్తలేదని పలువురు కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఆటో ఎవరూ ఎక్కడంలే : జంగయ్య, ఆటో డ్రైవర్
కరోనాతో నాలుగు నెలల నుంచి ఆటో ఎవరూ ఎక్కడంలే. ఇంకేదైనా పని చేద్దామంటే ఏ పనీ దొరక్కట్లే. కిస్తీలు కట్టాల్సిందేనని ఆటో ఫైనాన్స్‌ల్లో ఒత్తిడి పెంచుతున్రు.. పోలీస్ వాళ్లు పెట్టిన రూల్స్‌తో మరింత ఖర్చు పెరిగింది. ఏంజేయల్నో అర్థమైతలె. ప్రభుత్వమే ఆదుకోవాలె.
ఆర్థిక సాయమందించాలె..
కరోనాతో ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ దెబ్బతిన్నది. కార్మికులు పూటగడవక మస్తు ఇబ్బంది పడుతున్నరు. ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ఆటో కార్మికునికి నెలకు రూ. 5 వేల నగదు సాయం అందజేస్తున్నయి. తెలంగాణ సర్కార్ కూడా నెలకు రూ.7500 చొప్పున సాయం చేసి కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. శ్రీకాంత్ కోరుతున్నారు.