మొక్కేగా.. నాటారు.. వదిలేశారు

by Shyam |   ( Updated:2021-07-09 07:39:03.0  )
haritha haram plants
X

దిశ, భువనగిరి రూరల్: పైన కనిపిస్తోన్న చిత్రంలోని మొక్కలను చూశారా..? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు. ప్రతియేటా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో అట్టహాసంగా ఫొటోలకు పోజులిస్తూ నాటుతున్న మొక్కలు దుస్థితి ఇది. ప్రభుత్వం హరితహారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల అభాసుపాలవుతోంది.

తాజాగా.. గురువారం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో హరితహారం, పట్టణప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆడంబరంగా మొక్కలు నాటారు. కానీ, వాటి రక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం మాత్రం మర్చిపోయారు. దీంతో వారు నాటి, వదిలేసిన మొక్కలన్నీ శుక్రవారం తెల్లవారేసరికి మూగజీవాలకు ఆహారంగా మారిపోయాయి. మొక్కలకు రక్షణ కోసం కంచె ఏర్పాటు చేయకపోవడంతో కోతులు, మేకలు తెల్లారేసరికి ధ్వంసం చేశాయి. దీంతో స్థానిక ప్రజలు, విపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం మండలానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాటిన మొక్కల రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed