ఏది కరోనా మరణం…? అధికారుల్లో అయోమయం

by Shyam |   ( Updated:2021-11-09 22:01:56.0  )
corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మరణాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించాలనేది అధికారుల వద్ద స్పష్టమైన సమాచారం లేదు. ముఖ్యంగా జిల్లా వైద్యాధికారుల వద్ద కనీస ఇన్మర్మేషన్ ​లేకపోవడం గమనార్హం. దీంతో బాధితులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. తద్వారా కొవిడ్​ డెత్​ సర్టిఫికేట్​ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది బాధితులకు అర్థం కావడం లేదు. రెండు రోజుల క్రితం డెత్​లను నిర్ధారించేందుకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ కమిటీలను ఏర్పాటు చేసినా, వారి వద్ద కూడా సరైన సమాచారం లేదని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక చాలా మంది దరఖాస్తుల ప్రక్రియ కోసం జిల్లా కలెక్టరేట్లు, వైద్యారోగ్యశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

తొలి రోజు 20 దరఖాస్తులే..

కరోనా డెత్ సర్టిఫికెట్లను పొందేందుకు మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ షురూ అయింది. బాధితులు మీ సేవాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సర్కార్ స్పష్టం చేసినా, డాక్యుమెంట్లను సమర్పించే విషయం మీ సేవాల్లోనూ క్లారిటీ లేదు. కేంద్రం కొన్ని అంశాలతో మార్గదర్శకాలు ఇచ్చినా ప్రభుత్వం వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదు. దీంతో చాలా మంది దరఖాస్తులు చేసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. మొదటి రోజు కేవలం 20 అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి?

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కరోనా మృతుల నష్టపరిహారం రూ.50 వేలను తీసుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా అందించే కొవిడ్​ డెత్​ సర్టిఫికేట్​ తప్పనిసరి. ఓడీఎఫ్‌సీ(అఫీషియల్ డాక్యుమెంట్ ఫర్ కొవిడ్ డెత్‌) పేరిట ప్రత్యేక డాక్యుమెంట్​ ను అందజేస్తారు. దీన్ని తీసుకొని మీ సేవాల్లో రూ.50 వేల పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని​ కొరకు గ్రామపంచాయతీ , మున్సిపాలిటీ నుంచి తీసుకున్న డెత్ సర్టిఫికెట్‌తో పాటు పాజిటివ్ రిపోర్ట్‌ ఉండాలి. ఆ రిపోర్టు లేకపోతే ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఎంసీసీడీ (మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్‌) సర్టిఫికేట్​ను సమర్పించవచ్చు. అదీ లేకపోతే చికిత్స పొందిన సమయంలో తీసుకున్న స్కానింగ్​లు, టెస్టులు, రిపోర్టులు, మెడికల్​ బిల్లులు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. ఆ వివరాలను కమిటీ పరిశీలించి ఓడీఎఫ్​సీని అందిస్తుంది. ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌‌, ఇతర ఆధారాలతో నష్ట పరిహారం కోసం రెండో సారి మీసేవలో అప్లై చేయాల్సి ఉంటుంది. నెల రోజుల్లోనే బ్యాంక్ అకౌంట్‌లో రూ.50 వేలు జమ అవుతాయి.

Advertisement

Next Story

Most Viewed