ఆందోళనలో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్

by Shyam |
ఆందోళనలో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ వాయిదా పడటంతో ఆస్ట్రేలియా క్రికెటర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కోవిడ్ ఉపద్రవాన్ని ముందే పసిగట్టి ఆండ్రూ టై, కేన్ రిచర్డ్‌సన్, అడమ్ జంపా ముందుగానే ఐపీఎల్‌ను వదిలేసి స్వదేశానికి చేరుకున్నారు. బీసీసీఐ భరోసా ఇవ్వడంతో ఆసీస్ ప్లేయర్లతో పాటు అంపైర్ పాల్ రీఫిల్ కూడా ఇక్కడే ఉండిపోయారు. పాల్ రీఫిల్ వెళ్దామని అనుకున్నా విమానాలు అందుబాటులో లేకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్ రద్దు కావడంతో ఆసీస్ ప్లేయర్లు ఆందోళన చెందుతున్నారు. భారత్ నుంచి వచ్చే కమర్షియల్ ఫ్లైట్లను ఆస్ట్రేలియా ప్రభుత్వం మే 15 వరకు నిషేధించింది.

ఎవరైనా ఇండియా నుంచి ఆస్ట్రేలియాలో అడుగు పెడితే 5 ఏళ్ల జైలు శిక్ష కూడా విధిస్తామని ప్రధాని స్కాట్ మోరిస్ హెచ్చరించారు. దీంతో ఇప్పుడు స్వదేశాలకు ఎలా చేరుకోవాలో అర్దంకాక ఆసీస్ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియాను ఆటగాళ్లు సంప్రదించగా తాము కూడా ఏమీ చేయలేమని చేతులెత్తేసింది. అయితే బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వం ద్వారా ఆస్ట్రేలియా గవర్నమెంట్‌తో మాట్లాడి సురక్షితంగా స్వదేశానికి పంపుతామని చెబుతున్నది. అప్పటి వరకు ఆసీస్ ప్లేయర్లు బీసీసీఐ సంరక్షణలోనే కొనసాగవచ్చని కూడా భరోసా ఇచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియా వెళ్లాలని రెండు రోజుల క్రితం ఐపీఎల్ వదిలి వెళ్లిపోయిన కామెంటేటర్ మైఖేల్ స్లేటర్ మాల్దీవుల్లో చిక్కుకుపోయారు.

Advertisement

Next Story

Most Viewed