జడ్జి తమ్ముడిపై దాడి : విపక్షాల ఆగ్రహం 

by Anukaran |   ( Updated:2020-09-28 02:18:26.0  )
జడ్జి తమ్ముడిపై దాడి : విపక్షాల ఆగ్రహం 
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా, మదనపల్లి, బి.కొత్తకోటకు చెందిన దళిత జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై కొందరు దుండగులు ఆదివారం దాడిచేశారు. ఈ ఘటనలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై రాజకీయ దుమారం రేగడంతో మదనపల్లె డిఎస్పీ స్పందించారు.

ఘటనపై బాధితుడు రామచంద్ర మాట్లాడుతూ… బి.కొత్తకోట మండలం సూరపవారిపల్లెకు చెందిన కుమార్‌, ఆయన అనుచరులు కలసి తనపై దాడిచేసినట్లు తెలిపారు. బి.కొత్తకోట బస్టాండులో పండ్లు కొనుగోలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ట్రేషన్‌ కలిగిన కారులో వచ్చిన వారు తనపై అనూహ్యంగా దాడి చేశారన్నారు. రక్తం కారేలా ముష్ఠిఘాతాలు కురిపించారని తెలిపారు. దాడిచేసిన వారికి, తనకు గతంలో ఎలాంటి గొడవలు లేవని రామచంద్ర చెప్పారు. కాగా, తీవ్రంగా గాయపడిన రామచంద్రను స్థానికులు చికిత్స నిమిత్తం బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా వైద్యశాలకు పంపారు.

ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. అధికార పార్టీ నేతల అక్రమాలను ఎదిరించినందుకే దళిత జడ్జి రామకృష్ణ కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఐతే ఈ వ్యవహారంపై స్పందించిన మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ… దాడి పథకం ప్రకారం జరగలేదన్నారు. రోడ్డుపై అనుకోకుండా జరిగిన ఘర్షణేనని తెలిపారు. ఈ దాడికి, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed