ఈఎస్ఐ స్కామ్‌లో రూ.144 కోట్ల ఆస్తులు అటాచ్

by Shyam |
ESI scam
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ(ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్) వేగం పెంచింది. ఏసీబీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పలుచోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈఎస్ఐ ఔషధాల కొనుగోలులో కీలకపాత్ర పోషించిన ఐదుగురు నిందితులకు సంబంధించిన రూ.144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొన్నది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ, ఫార్మసిస్టు నాగలక్ష్మి, ఓమ్ని గ్రూపు డైరెక్టర్ కె.శ్రీహరిబాబు, పందిరి రాజేశ్వర్​రెడ్డి ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది.

వీటిలో దేవికారాణికి రూ.17 కోట్ల 26 లక్షల విలువైన ఆస్తులు ఉండగా, నాగలక్ష్మికి రూ.2 కోట్ల 45 లక్షలు, జేడీ పద్మకు రూ.74 లక్షల 8వేల విలువైన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. దీంతో పాటు ఓమ్ని గ్రూపు డైరెక్టర్ కె.శ్రీహరిబాబుకు చెందిన రూ.119 కోట్ల 89 లక్షలు, పందిరి రాజేశ్వర్​రెడ్డికి చెందిన రూ.4 కోట్ల 7 లక్షల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. నిందితులు కూడబెట్టుకున్న అక్రమాస్తుల్లో ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ, బెంగళూరు, నోయిడాలో 131 స్థిరాస్తులను గుర్తించినట్లు తెలిపారు. వాటిలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 కమర్షియల్​ బిల్డింగ్‌లు, ఆరు వ్యవసాయ భూములు, 4 ఫ్లాట్లు ఉన్నాయని ఈడీ పేర్కొంది. దీంతో పాటు సెక్యూరిటీలు, ఫిక్స్‌డ్​డిపాజిట్ల వంటి చరాస్తులూ ఉన్నట్లు వెల్లడించింది.

2015 నుంచి 2019 వరకు మందులు, పరికరాల కొనుగోళ్లలో ఈఎస్ఐలో సుమారు రూ.211 కోట్ల స్కాం జరిగినట్లు ఈడీ ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదు చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పరికరాలు, మందులను అసలు ధరలు కంటే ఐదారు రెట్లు ఎక్కువ కొనడంతోనే స్కాం జరిగినట్లు ఈడీ గతంలో వివరించింది.

వాటితోనే నిందితులు భారీ స్థాయిలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తూ కేసులు నమోదు చేశారు. అయితే ఈ స్కాం కేసులో గతంలో ప్రస్తుత నిందితులతో పాటు అప్పటి కార్మికశాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి, పీఎస్ ముకుంద రెడ్డి ఇళ్లల్లోనూ సోదాలు చేసి దాదాపు కోటిన్నర రూపాయలను ఈడీ స్వాధీనం చేసుకుంది.

Advertisement

Next Story