కలుపు మొక్కలతో యోగా మ్యాట్స్..

by Sujitha Rachapalli |
కలుపు మొక్కలతో యోగా మ్యాట్స్..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా నదులు, సరస్సులు, చెరువులు, కాలువలు ప్లాస్టిక్ వల్ల పెనుప్రమాదాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కాలుష్యంనుండి మంచినీటి సరస్సులను కాపాడటానికి అస్సాం ఫిషింగ్ కమ్యూనిటీకి చెందిన ఆరుగురు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే డీపర్ బీల్ సరస్సు సమీపంలో నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, సిమాంగ్ కలెక్టివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో 100% బయోడిగ్రేడబుల్ యోగా మాట్స్‌ను రూపొందిస్తున్నారు. వీటి తయారికోసం మొక్కలను రీసైక్లింగ్ చేస్తూ, సేవ్ లేక్స్ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు.

అస్సాంలోని డీపర్ బీల్ మంచినీటి సరస్సు విశిష్ట పక్షులకు, వన్యప్రాణులకు చిరునామాగా నిలుస్తుంది. దీన్నే రామ్‌సర్ కన్వెన్షన్ సైట్ అని కూడా పిలుస్తారు. ఇది పక్షి శాస్త్రవేత్తలకు స్వర్గం. సుమారు 200 వలస పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. వన్యప్రాణి జీవశాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు కూడా ఈ ప్రదేశానికి తరచూ వస్తుంటారు. కొన్నేళ్లుగా మత్స్యకార వర్గానికి చెందిన తొమ్మిది గ్రామాల ప్రజలకు ఈ సరస్సే జీవనోపాధి. కానీ వాటర్ హైసింత్ మొక్కల అనియంత్రిత పెరుగుదల పెద్ద సమస్యగా మారింది. ఈ మొక్కలు గుర్రపుడెక్క మాదిరిగా చెరువంతా వ్యాపిస్తున్నాయి. దాంతో వీటి వృద్ధిని నిర్మూలించడానికి ప్రభుత్వ అధికారులు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. ఫలితం శూన్యం. ఇక వలస పక్షులు, స్థానిక జంతువులపై ఈ మొక్కలు ప్రతికూల ప్రభావం చూపడంతో.. ఈ సమస్యకు చెక్ చెప్పి, సరస్సును పునరుద్ధరించేందుకు ఆరుగురు మహిళలు (మిటాలి, రూమి, మామోని, భంటి, సీతా, రితూ) ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆ కలుపు మొక్కల నుంచి బ్యాగ్‌, టేబుల్ రన్నర్స్‌తో పాటు యోగా మ్యాట్స్ కూడా తయారు చేస్తూ.. అభినందనలు అందుకుంటున్నారు.

మొక్కలను సోలార్ డ్రైయర్స్ సాయంతో ఎండబెట్టి వాటి నారల సాయంతో మ్యాట్స్ రూపొందిస్తారు. సహజ రంగుల్ని వీటికోసం ఉపయోగించడం విశేషం. ఒక నెలలో 700 మాట్స్ ఉత్పత్తి అవుతుండగా ఇప్పటివరకు సరస్సు నుంచి 10వేల కిలోల నీటి హైసింత్‌ను తొలగించగలిగారు. ఈ వెంచర్ ప్రత్యేకమైంది కావడంతో మంచి ఆదాయాన్ని కూడా అందిస్తుంది. ఆరుగురితో మొదలైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం 38 మంది మహిళలకు స్వయం ఉపాధిని కల్పించే దిశగా అడుగులు వేసింది. మరింత ఎక్కువ మంది మహిళలు నేర్చుకోవాలని తాము ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు బృంద సభ్యులు తెలిపారు. త్వరలో ఈ స్వదేశీ ఉత్పత్తి ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్థానిక పర్పుల్ మూర్హెన్ పేరు మీద ఈ మ్యా‌ట్‌కు ‘మూర్హెన్ యోగా మ్యాట్’అని పేరు పెట్టారు. మేఘాలయకు చెందిన నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (నెక్టార్), గువహతిలోని సామాజిక సంస్థ సిమాంగ్ కలెక్టివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ ఆవిష్కరణకు మద్దతు లభించింది.

వాటర్ హైసింత్ (ఐక్రోనియా కార్సిప్స్) అనేది దక్షిణ అమెరికాలోని అమెజాన్ బేసిన్‌లో ఉద్భవించిన కలుపు కాగా భారతదేశపు మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ భార్య లేడీ హేస్టింగ్స్ ఆ మొక్కల సౌందర్యానికి ఫిదా అయిపోయింది. ఆమె ఇండియాకు వచ్చినప్పుడు ఆ మొక్కలను కూడా ఇక్కడకు తీసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed