‘తంగ్సా’ లిపి: మాతృభాషపై మమకారం.. 30 ఏళ్ల శ్రమకు ఫలితం..

by Anukaran |   ( Updated:2021-09-05 21:59:03.0  )
‘తంగ్సా’ లిపి: మాతృభాషపై మమకారం.. 30 ఏళ్ల శ్రమకు ఫలితం..
X

దిశ, ఫీచర్స్: భారతదేశంలో గత 60ఏళ్లలో దాదాపు 250 భాషలు అంతరించిపోయాయి. దీంతో ఆయా భాషలు మాట్లాడేవారు ఇతర భాషల్లోకి వలస వచ్చారు. అంటే వారికి తెలియకుండానే తమ సంస్కృతి, గుర్తింపును వదిలిపెట్టారని అర్థం. అందువల్లే భాష బతికితే మన సంస్కృతి కూడా తరతరాలు వర్ధిల్లుతుంది. అయితే భాషను సంరక్షించేందుకు అనేక మార్గాలున్నాయి. అందులో ఒకటి పాఠ్యాంశాల్లో చేర్చడం ముఖ్యమైంది. మరి భాష‌కు లిపి లేకపోతే ఎలా? మనం మాట్లాడే పదాల డాక్యుమెంటేషన్ లేకపోతే తర్వాతి తరానికి అందించడం చాలా కష్టం. అయితే ఇలాంటి సమస్యే అరుణాచల్ ప్రదేశ్‌లోని తంగ్సా కమ్యూనిటీ ప్రజలకు వచ్చింది. దీంతో చాంగ్లాంగ్ జిల్లాకు చెందిన దివంగత లఖుమ్ మొసాంగ్ అనే వ్యక్తి ‘తంగ్సా’ లిపిని అభివృద్ధి చేశాడు. ఈ మేరకు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కొత్తతరం తమ ఆచార, సంప్రదాయాలు, జానపదాలను నేర్చుకుంటున్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని తంగ్సా కమ్యూనిటీ జనాభా దాదాపు ఒక లక్ష వరకు ఉంటుంది. ఆ కమ్యూనిటీలోని వివిధ తెగలకు చెందిన ప్రజలు 40 విభిన్న ఉప భాషల(యాస)ను మాట్లాడుతుంటారు. అయితే తమకు సొంతమైన లిపి లేకపోవడంతో, వారందరూ రోమన్ స్క్రిప్ట్ ఉపయోగిస్తున్నారు. ఇలా ప్రతి తెగ తమ సొంత మాండలికాన్ని మాట్లాడుతుంటే, తంగ్సా భాష అంతరించిపోయే ప్రమాదం రెండు రెట్లు రెట్టింపు అవుతుందని ఉపాధ్యాయుడు లఖుమ్ ఆందోళన చెందాడు. దీంతో అన్నీ కమ్యూనిటీలు ఉపయోగించగల సాధారణ లిపిని అభివృద్ధి చేయడానికి అతడు పూనుకున్నాడు. 30ఏళ్ల కృషి తర్వాత 2019లో పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేయగా, అది ప్రభుత్వం ఆమోదం పొందింది. కానీ దురదృష్టవశాత్తూ లఖుమ్ ఆ తర్వాతి ఏడాదే మరణించగా, అతడి సంకల్పం మాత్రం కొనసాగుతోంది.

భాషను బతికించాలనే ఉద్దేశ్యంతో..

లఖుమ్‌ స్నేహితుడైన వాంగ్లంగ్ మొసాంగ్ రైతుగా జీవనం సాగిస్తూనే.. విదేశీయులకు పార్ట్‌టైమ్ సాంస్కృతిక సలహాదారుడిగా పనిచేసేవాడు. అయితే పదాల ఉచ్ఛారణ, లిపి అభివృద్ధిలో వాంగ్లంగ్ సాయం కోరాడు లఖుమ్. ఈ క్రమంలోనే తంగ్సా లాంగ్వేజ్‌పై పట్టు సాధించగా, మిత్రుడు మరణించడంతో ఆ బాధ్యతను తాను తీసుకున్నాడు. భాషను బతికించాలనే ఉద్దేశంతో కళాశాల విద్యార్థులు, గ్రాడ్యుయేట్లకు స్క్రిప్ట్ నేర్పించడానికి ముందుకు వచ్చాడు. ప్రస్తుతం పదిహేను మంది విద్యార్థులు తంగ్సా లిపిని నేర్చుకుంటున్నారు.

తంగ్సా ప్రజల మాండలికంలో పదాల అర్థం స్వరాన్ని బట్టి మారుతుంది. దీంతో స్క్రిప్ట్ టోన్ ఆధారంగా అభివృద్ధి చేయగా, ప్రతి ఉప-తెగ అన్ని మాండలికాల్లో ఒకేరకమైన అచ్చులు, హల్లులను ఉపయోగించి వారి సొంత మాండలికంలోనే రాసుకునే అవకాశముంది. లఖుమ్ తయారుచేసిన ఈ స్క్రిప్ట్‌ను మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఫాంట్ స్టైల్‌గా అడాప్ట్‌ చేసుకోవడం విశేషం. అంతేకాదు ఇది ప్రపంచ ఎన్‌కోడింగ్ స్టాండర్డ్ యూనికోడ్‌లో చేర్చడానికి కూడా ఆమోదం పొందింది. తంగ్సా కొత్త లిపిని నేర్చుకోవడంలో సహాయపడటానికి రాష్ట్రంలో ఒక మొబైల్ యాప్ కూడా అభివృద్ధి చేశారు.

భాషా ప్రియులకు ఆదర్శంగా..

ఇది ఒక గొప్ప ముందడుగు. తంగ్సా ప్రజలు ఈ లిపిని నేర్చుకుని, తమ ప్రత్యేకమైన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవడంలో ఇతర భాషా ప్రియులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. లఖుమ్, వాంగ్లంగ్ తో పాటు మొత్తం గిరిజనుల కృషి భారతదేశంలోని అంతరించిపోతున్న భాషల భవిష్యత్తుకు జీవం పోస్తుంది. ఒక చిన్న తెగ లిపిని అభివృద్ధి చేయగలిగితే మిగతా వారికి కూడా ఇది సాధ్యమవుతుంది. స్థానిక ఆదివాసీ వర్గాలకు గుర్తింపునిచ్చేది భాష. సరైన యాస, లిపి లేనప్పుడు, తమ మాతృభాషను మాట్లాడే ప్రజలు లేనప్పుడు వారి ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. చరిత్రగతిలో కనుమరుగైపోతారు – స్టీఫెన్ మోరీ, భాషా పరిశోధనా పండితుడు, ఆస్ట్రేలియా ప్రొఫెసర్

ఇతర భాషల స్క్రిప్ట్స్‌కు భిన్నం..

ఇతర కమ్యూనిటీ సభ్యులతో కమ్యూనికేట్ కావడానికి మేము అస్సామీ, ఇంగ్లీష్ లేదా హిందీని ఉపయోగించాలి. కానీ ఈ సాధారణ లిపి మన జానపద కథలు, పాటలు, కవితలు, ఆహార అలవాట్లు, విశ్వాస వ్యవస్థలు, ఆచారాలతో పాటు మరిన్నింటిని కాపాడటానికి సహాయపడుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే పాఠశాల పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ, 2020 ఉపాధ్యాయ దినోత్సవం రోజున తంగ్సా స్క్రిప్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ లిపి ఇతర భాషల స్క్రిప్ట్స్‌కు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో 48 అచ్చులు, 31 హల్లులు ఉన్నాయి. – వాంగ్లంగ్, తంగ్సా స్క్రిప్ట్ టీచర్

ఏయే భాషలున్నాయి..?

అరుణాచల్ ప్రదేశ్‌లోని భాషలు సైనో-టిబెటన్ భాషా కుటుంబం కింద వర్గీకరించబడ్డాయి. ముఖ్యంగా టిబెటో-బర్మన్, తాయ్ భాషల లోలో-బుర్మిష్, బోధిక్, సాల్, తాని, మిష్మి, హ్రుయిష్ తాయ్ వంటి భాషలుగా క్లాసిఫై చేశారు. ఇక గిరిజన భాషల కోసం విద్యా వ్యవస్థలో దేవనాగరి, అస్సామీ, రోమన్ స్క్రిప్ట్‌లను ప్రవేశపెట్టినప్పటికీ, తానీ లిపి, వాంచో స్క్రిప్ట్ వంటి కొత్త లిపిలను స్థానిక పండితులు అభివృద్ధి చేశారు. అయితే రాష్ట్రంలో అనేక భాషలు ఉన్నప్పటికి, దాదాపు అన్ని అంతరించిపోతున్నట్లు సెంటర్ ఫర్ ఎన్‌డేంజర్డ్ లాంగ్వేజెస్ అధ్యయనంలో వెల్లడైంది. ఈ జాబితాలో ‘తంగ్సా’ భాష కూడా ఉంది. ఇక తంగామ్‌ల విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆదివాసీలైన వీళ్లు, సంవత్సరాలుగా తమ భాష నుంచి ఇతర భాషలకు వలస వెళ్లారు తమ మనుగడ కోసం అనేక భాషలను మాట్లాడుతుంటారు.

Advertisement

Next Story

Most Viewed