- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కనీవినీ ఎరుగని రీతిలో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు, అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి తలసాని సీఎం కేసీఆర్‌పై ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన ఎన్టీఆర్ స్టేడియంలో అధి శ్రవణ యాగం జరగనుంది. తెలంగాణలో పేదరికం ఉండొద్దని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రావద్దని కోరడం ఈ యాగం ప్రత్యేకత.
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు గతంలో ఎన్నడూ లేనంత గ్రాండ్‌గా ఈసారి జరుగుతున్నాయి. యువతను ఆకట్టుకునేలా క్రికెట్ పోటీల నిర్వహణ మొదలు మొక్కలు నాటడం, అన్నదానం, రక్తదానం దాకా అనేక రకాల కార్యక్రమాలను పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులంతా కేసీఆర్‌ను ‘తెలంగాణ జాతిపిత’గా కొనియాడుతున్నాయి. ఊరూ వాడ ఏకమయ్యేలా సంబురాలను నిర్వహిస్తున్నారు. గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటాలన్నది ఒకరి లక్ష్యమైతే 600 ఏళ్లలో జరపని తీరులో ఈసారి ఆయన పేరు మీద యాగం చేయాలన్నది మరొకరి లక్ష్యం. కేసీఆర్ పుట్టింది మొదలు ముఖ్యమంత్రి స్థాయి దాకా ఆయన జీవితాన్ని డాక్యుమెంటరీలో నిక్షిప్తం చేయాలనుకున్నది ఒకరైతే ఆలయాల్లో ఆయన పేరుమీద పట్టు వస్త్రాలు, బంగారు చీరెలను సమర్పించాలన్నది మరొకరు. ఇలా ఎవరికి వారుగా వారివారి స్థాయిల్లో కేసీఆర్ బర్డ్ డే వేడుకలను జరపాలనుకుంటున్నారు.
డాక్యుమెంటరీగా కేసీఆర్ జీవితం..
ఇప్పటిదాకా కేసీఆర్ జీవిత చరిత్రను చాలా మంది పుస్తకాల రూపంలో ముద్రించారు. కానీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈసారి నలభై నిమిషాల నిడివితో ఏకంగా ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అయిన తలసాని ఆ డాక్యుమెంటరీలో కేసీఆర్ బాల్యం మొదలు ముఖ్యమంత్రి దాకా అనేక ఘట్టాలు ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేసీఆర్ ఖ్యాతిని కీర్తించేలా ఐదు గీతాల ఆల్బమ్‌కు కూడా శ్రీకారం చుట్టారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని జల విహార్‌లో డాక్యుమెంటరీ, ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ, ప్రదర్శన జరగనున్నాయి.
ఎంపీ సంతోష్ వినూత్న సృష్టి కోటి వృక్షార్చన..
రాష్ట్ర సాధన ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో సన్నిహితంగా, నీడలాగా వ్యవహరించిన ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కృషిలో భాగంకోగా గంట వ్యవధిలో రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటేలా సెలబ్రిటీలతో సందేశం ఇప్పించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులందరికీ తలా ఒకటి చొప్పున హెర్బల్ మొక్కలను పంపిణీ చేసి వాటిని నాటేలా చొరవ తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో కేసీఆర్ జన్మదినానికి గుర్తుగా ఇప్పుడు నాటే మొక్కలు రేపటి తెలంగాణ హరిత వనాలకు నాంది పలకాలని భావిస్తున్నారు.
పూల మొక్కలతో కేసీఆర్ చిత్రపటం..
ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ అమలుచేస్తున్న ‘హరితహారం’ పథకం ద్వారా స్ఫూర్తిపొందిన తూర్పుగోదావరి జిల్లా యానాం గ్రామానికి చెందిన ఒక నర్సరీ నిర్వాహకులు సృజనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని పల్లా వెంకన్న నర్సరీకి చెందిన పల్లా సుబ్రమణ్యం, పల్లా సత్తిబాబు, పల్లా గణపతి తదితరులు రకరకాల పూల మొక్కలతో కేసీఆర్ చిత్రపటాన్ని తీర్చిదిద్దారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న సంకల్పాన్ని చూసి తాము ఉత్సాహం పొందినట్లు తెలిపారు. సార్ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ కప్ పేరుతో పలు రకాలు పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.
600 ఏళ్ల తర్వాత అధి శ్రవణ యాగం
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన ఎన్టీఆర్ స్టేడియంలో అధి శ్రవణ యాగం జరగనుంది. కేరళలో సంప్రదాయ ‘నంబూద్రి’ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో 600 ఏళ్ల క్రితం జరిగిన ఈ యాగం మళ్లీ ఇప్పుడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా జరుగుతోంది. తెలంగాణలో పేదరికం ఉండొద్దని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రావద్దని కోరడం ఈ యాగం ప్రత్యేకత. దీనికి తోడు హనుమాన్ హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం తదితరాలు కూడా వేర్వేరు ప్రాంతాల్లో కేసీఆర్ కోసం జరుగుతున్నాయి. ఇక నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి బంగారు చీరను ఎమ్మెల్సీ కవిత సమర్పించనున్నారు. కవిత చొరవను స్ఫూర్తిగా తీసుకునే టీఆర్ఎస్ శ్రేణులు పేద మహిళలకు కూడా ఉచితంగా చీరలను పంపిణీ చేయనున్నారు. కేసీఆర్ కుటుంబంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ కోటి కుంకుమార్చన కూడా జరగనుంది. అంతేకాదు.. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం, అన్నదానం నిర్వహించనున్నాయి.