ఆ బస్టాండ్ ఎంతో స్పెషల్.. ఎందుకో తెలుసా..

by Sujitha Rachapalli |
ఆ బస్టాండ్ ఎంతో స్పెషల్.. ఎందుకో తెలుసా..
X

దిశ, ఫీచర్స్: దక్షిణ కశ్మీర్‌లో ఓ బస్టాండ్‌ నిరూపయోగంగా ఉండటంతో ఆర్మీ ఆఫీసర్లు దాన్ని ‘స్ట్రీట్ లైబ్రరీ’గా మార్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పోటీ పరీక్షలు, ఉన్నత చదువులకు సిద్ధమవుతున్న పొరుగు గ్రామాల విద్యార్థులకు ఇది సహాయపడుతోంది. బుక్స్ ఆఫ్ ఇండియా సంస్థతో కలిసి 18 రాష్ట్రీయ రైఫిల్స్ ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీకి స్థానికంగా మంచి ఆదరణ లభిస్తోంది. రాణీపూర్, చిత్తీసిగ్పురా, కెజ్రివల్, దేవీపురా గ్రామాలకు చెందిన విద్యార్థులు ఈ లైబ్రరీ సేవలను వినియోగించుకుంటున్నారు.

ఒక మంచిపుస్తకం చదివితే మంచి స్నేహితుడితో సంభాషించినట్లే అంటారు పుస్తక ప్రియులు. అంతేకాదు లోకజ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని అందించే పుస్తకాలు విద్యార్థుల్లో మనోవికాసాన్ని పెంచడంతో సాయం చేస్తాయి. అందువల్లే గతంలో ప్రతి గ్రామంలో ‘గ్రంథాలయం’ ఏర్పాటు చేయడం ఉద్యమంలా కొనసాగింది. ప్రజెంట్ e-లైబ్రరీలు అందుబాటులోకి వచ్చినా నగర, పట్టణ, గ్రామ గ్రంథాలయాలకు ఆదరణ తగ్గడం లేదు. ఇటీవల కాలంలో ‘స్ట్రీట్ లైబ్రరీ’ల ట్రెండ్ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో అనంతనాగ్ జిల్లాలోని దేవిపోరా-చిట్టిసింగ్పోరా జంక్షన్ వద్ద ఉన్న పాడుబడిన బస్టాండ్‌ను కశ్మీర్ ఆర్మీ అధికారులు ‘వీధి గ్రంథాలయంగా’ తీర్చిదిద్ది జ్ఞాన కేంద్రంగా మార్చారు. అకడమిక్ బుక్స్‌తో పాటు అనేక కామిక్స్‌, సామాజిక సందేశ పుస్తకాలు, మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, ప్రముఖ కవి ఖలీల్ జిబ్రాన్ పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచారు.

‘పుస్తకాలు మన ఊహశక్తిని పెంపొందిస్తాయి. అవి ప్రపంచ విజ్ఞానాన్ని చూడ్డానికి కిటికీలను తెరుస్తాయి. కొత్త విషయాలను అన్వేషించడానికి, విజయాలు సాధించడానికి స్ఫూర్తినిస్తాయి. అంతేకాదు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. ఈ మాటలే మమ్మల్ని స్ట్రీట్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు ప్రేరణనిచ్చాయి. వీధి గ్రంథాలయం ఉదయాన్నే తెరుచుకుంటుంది. అన్ని తరగతుల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. కాలేజీ విద్యార్థులను చూసి, స్కూల్ స్టూడెంట్స్ కూడా గ్రంథాలయానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పోటీ పరీక్షలు, ఉన్నత చదువులకు హాజరయ్యే యువకులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. స్థానిక విద్యార్థులతో పాటు పొరుగు గ్రామాల విద్యార్థులు కూడా ఇక్కడకు వస్తున్నారు. కేవలం అకడమిక్ పుస్తకాలే కాకుండా, విద్యార్థులు రిలాక్సయ్యేందుకు సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, నావల్స్, మిస్టరీ పుస్తకాలతో పాటు మనో వికాసానికి అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాం. లైబ్రరీకి ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో మరిన్ని ప్రారంభించేందుకు మా ఆర్మీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు’ అని లెఫ్టినెంట్ కల్నల్ రోహిత్ జా తెలిపారు.

Advertisement

Next Story