ఆత్మనిర్భర్ భారత్‌కు సైన్యం మద్దతు

by Anukaran |   ( Updated:2020-08-27 06:31:08.0  )
ఆత్మనిర్భర్ భారత్‌కు సైన్యం మద్దతు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్‌’కు మద్దతు ఇవ్వడానికి సాయుధ దళాలు కట్టుబడి ఉన్నాయని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. గురువారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత జరిగిన ‘అత్మనిర్భర్ భారత్’ వెబినార్ కార్యక్రమంలో త్రివిధ దళాధిపతి రావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలతో యుద్ధంలో విజయం సాధించడం గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు.

అలాగే, స్వదేశీ ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం, సంకల్పం తమకు ఉన్నాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌ ను సరైన దిశలో ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందని.. దీంతో స్వీయ-సామర్థ్యాన్ని సాధించడానికి, నికర ఎగుమతిదారుగా మారడానికి ఇదే సమయం అంటూ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు.

మేక్ ఫర్ వరల్డ్: రాజ్‌నాథ్ సింగ్

ఇదే వెబ్‌నార్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మాట్లాడుతూ.. మా సహకార ప్రయత్నాల ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ ను మాత్రమే కాకుండా.. ‘మేక్ ఫర్ వరల్డ్’ ను కూడా సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. మెరుగైన మార్గంలో ప్రపంచానికి తోడ్పడటానికి స్వావలంబన పొందాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ దిశలోనే.. 101 రక్షణ వస్తువుల దిగుమతిపై నిషేధం విధించామన్నారు.

Advertisement

Next Story

Most Viewed