రాయలసీమ లిప్ట్ నిర్మాణంపై రేపు వాదనలు

by Anukaran |   ( Updated:2020-08-30 09:27:05.0  )
రాయలసీమ లిప్ట్ నిర్మాణంపై రేపు వాదనలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సోమవారం హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాలకు నష్టం కలుగుతుందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఐదెకరాల్లో కృష్ణా జలాల ఆధారంగా వ్యవసాయం చేసే రైతుగా పేర్కొంటూ ఈ పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి లోబడి టెండర్లు రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. హైకోర్టులో దీనిపై చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేనారెడ్డితో కూడిన మొదటి నెంబర్ ధర్మాసనం వాదనలు విననుంది. ఐదో నెంబర్ కేసుగా రాయలసీమ ఎత్తిపోతల పిటిషన్ రానుంది.

కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమ కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జులై 15న టెండర్లు పిలిచిందని, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జులై 1న ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రాజెక్టును నిర్మించేందుకు టెండర్లు ఖరారు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం రద్దుతో పాటు పాలమూరు-రంగా రెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను ఏడాది లోపు పూర్తిచేసేలా ఆయా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్ కోరారు.

Advertisement

Next Story