తక్షణ గృహ రుణాలు ఎంతవరకు సురక్షితం?

by Shyam |   ( Updated:2020-11-06 23:26:16.0  )
తక్షణ గృహ రుణాలు ఎంతవరకు సురక్షితం?
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత ఇంటిని నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. దీనికోసం బ్యాంకుల చుట్టూ తిరిగేవారికి లోన్ కోసం పట్టే సమయం, అయ్యే ప్రాసెస్ ఎంతో ఓపిగ్గా చూసుకున్నప్పటికీ బ్యాంకులో అప్లై చేసిన తర్వాత ఎప్పటికీ లోన్ మంజూరు అవుతుందో తెలీదు. కొన్ని వారాలు, నెలల సమయం పట్టొచ్చు. ఇటీవల సాంకేతికత పెరిగి డిజిటల్ విధానంలో ఈ ప్రక్రియ మొత్తాన్ని తక్కువ సమయంలోనే ముగిసే అవకాశం లభిస్తోంది. డిజిటల్ మార్కెటింగ్‌లో భాగంగా బ్యాంకులు తక్షణ గృహ రుణ(ఇన్‌స్టాంట్ లోన్)లను అందిస్తున్నాయి. ఈ మధ్యనే దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ పేపర్‌లెస్, ఇన్‌స్టాంట్ గృహ రుణాలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉండి, కొత్తగా గృహ రుణాన్ని పొందాలనుకునే ఖాతాదారులు అర్హత, అవసరాన్ని బట్టి గృహ రుణాన్ని మంజూరు చేస్తారు. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో బ్యాంకు ఖాతాదారులైన ఉద్యోగులకు రూ. 1 కోటి వరకు రుణాలను అందిస్తున్నారు. ఈ రుణాలను 30 సంవత్సరాల కాలపరిమితి విధిస్తున్నారు. ఇందులో వయసును బట్టి రుణ మొత్తంలో మార్పులుంటాయి. ఇదివరకే గృహ రుణాన్ని తీసుకున్న వారి విషయంలో ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ విధానంలో పదేళ్ల కాలపరిమితికి గానూ, రూ. 20 లక్షల వరకు ఇన్‌స్టాంట్ హోమ్ లోన్‌ను బ్యాంకు అందిస్తోంది. ఈ రుణాలు పూర్తిగా పేపర్‌లెస్ రూపంలో ఇస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు రుణాలను పొందడం సులభంగా మారిన పరిస్థితుల్లో ఈ ఇన్‌స్టాంట్ లోన్‌లు ఎంతవరకు సురక్షితమో తెలుసుకుందాం..!

క్రెడిట్ సమాచారం భద్రంగా ఉండాలి..

ఇదివరకు ఇచ్చే రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి గురించిన వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి వచ్చేది. దీనికోసమే ఎక్కువ సమయాన్ని బ్యాంకులు కేటాయించేవి. ఇప్పుడు డిజిటల్ వినియోగం పెరగడంతో రుణాన్ని తీసుకునే వ్యక్తి క్రెడిట్ వివరాలను త్వరితగతిన తెలుసుకునే వెసులుబాటు వచ్చింది. దశాబ్దం క్రితం నుంచే డిజిటలైజేషన్ విధానం మొదలైనప్పటికీ, వేగంగా, పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ అందుబాటులోకి వచ్చింది మాత్రం మూడు, నాలుగేళ్ల నుంచే. డిజిటల్ వేదిక ద్వారా రుణాలను అందించే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నాన్-క్రెడిట్ సమాచారం ద్వారా క్రెడిట్ సమాచారాన్ని సేకరిస్తున్నాయి. రుణగ్రహీతలు నెల మొత్తానికి షాపింగ్ ఖర్చులను, షాపింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, వ్యాలెట్ సంస్థల నుంచి రుణగ్రహీతలు ఎంత మొత్తంలో వ్యాలెట్‌ను నెలవారీగా నిర్వహిస్తున్నారు, అందులో ఎంత ఖర్చు చేస్తున్నారనే సమాచారాన్ని తెలుస్తుకుంటున్నారు.

అవసరమైన పత్రాలు తప్పనిసరి..

అయితే, ఇన్‌స్టాంట్ లోన్ కాబట్టి ప్రతీసారి తక్షణమే, పేపర్‌లెస్, ఆన్‌లైన్ రూపంలో ఈ విధమైన లోన్‌ను పొందలేరు. కొన్నిసార్లు బ్యాంకు శాఖ వద్దకు వెళ్లి సంప్రదించాల్సి వస్తుంది. తొందరగా రుణాలను పొందవచ్చనే కారణంతో చాలామంది ఇన్‌స్టాంట్ లోన్ కోసం ప్రక్రియ ప్రారంభిస్తారు. కానీ, గృహ రుణాల కోసం ఆస్తి కొనుగోలు పత్రాలు, హక్కు పత్రాలు వంటి సాధారణ ప్రక్రియలు తప్పనిసరి. కావున, ఈ ప్రక్రియ కోసం కొంత సమయం వేచి ఉండక తప్పదని ఫైనాన్స్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇన్‌స్టాంట్ హోమ్ లోన్ అసలు మొత్తం మంజూరు అయిన తర్వాత కూడా ఖాతాదారుడు ఆస్తి పత్రాలను, వేతన సంబంధిత పత్రాలను బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌ను డిజిటల్‌గానే చేసుకోవచ్చు. దీనికోసం ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌లో లాగ్-ఇన్ అయ్యి, ఇన్‌స్టాంట్ లోన్ కోసం అప్లై చేయాలి. ఎంత రుణం కావాలనుకుంటున్నారు, కాలపరిమితి, బ్యాంకు రిజిస్టర్‌డ్ నంబర్‌కు బ్యాంకు పంపే ఓటీపీని నమోదు చేసి ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

పరిమితులను తెలుసుకోండి..

ఇదే సమయంలో, గృహ రుణం తక్షణం అందిన తర్వాత కూడా, అందులోని అనుకూలతలు, ప్రతికూలతలు ఏమున్నాయో తెలుసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. తక్షణం అందే రుణాల్లో వడ్డీ భారం అధికంగా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఇన్‌స్టాంట్ హోమ్ లోన్‌లపై ఎంతవరకు వడ్డీ విధిస్తున్నారనే విషయాన్ని ముందుగా తెలుసుకోవడం మంచిది. అదేవిధంగా, తక్షణ రుణాలను తీసుకోవాలనుకునే వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే, ఇన్‌స్టాంట్ హోమ్ లోన్ కావాలంటే, రుణ గ్రహీతకు బ్యాంకులో ఇదివరకే సేవింగ్స్ అకౌంట్ ఉండాలని, లేదంటే వేరే అవసరానికి రుణాన్ని పొంది ఉండాలి అని. అలాగే, బ్యాంకులో వేతన ఖాతా లేదంటే, వేతనానికి సంబంధించి అకౌంట్ హిస్టరీ బ్యాంకు వద్ద ఉండాలి. అలా ఉంటే గనక, ఖాతాదారుడి వేతనం, ఈఎంఐ హిస్టరీ బ్యాంకులు సులభంగా తెలుసుకుంటాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తక్షణ గృహ రుణానికి అర్హతను బ్యాంకులు నిర్ణయిస్తాయి. మరో ముఖ్యమైన విషయంగా, అవసరం లేకపోయినప్పటికీ, తక్షణం రుణాన్ని పొందవచ్చనే సాకుతో ఈ రకమైన రుణాలను తీసుకోవద్దని, దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story