ఆండ్రాయిడ్‌లో.. యాపిల్ ‘ఫేస్‌టైమ్’ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్

by Shyam |
Apple
X

దిశ, ఫీచర్స్: కరోనా కాలం నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లకు బూమ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దిగ్గజ కంపెనీ యాపిల్ తమ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యుడబ్ల్యుడీసీ)లో ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. యాపిల్ యూజర్లను ఎంతగానో ఆకర్షించిన వీడియో యాప్ ‘ ఫేస్‌టైమ్’ను త్వరలోనే ఆండ్రాయిడ్, విండోస్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.

యాపిల్ 2010‌లో ఐఫోన్ 4తో పాటు ‘ఫేస్‌టైమ్’ యాప్‌ను లాంచ్ చేయగా.. తన వినియోగదారులకు వీడియో, ఆడియో కాలింగ్‌ సర్వీస్‌ను అందించడంలో ఈ యాప్ సూపర్ సక్సెస్ సాధించింది. ఉచితంగా ఉపయోగించగల ఫేస్‌టైమ్ యాప్.. యాపిల్ డివైజ్‌లలో మాత్రమే వినియోగించగలం. అయితే దశాబ్దం తర్వాత ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ కొత్త అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుండటం విశేషం. కాగా యాపిల్ లాంచ్ చేసిన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను.. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్ పోటీదారుగా మార్చడానికి టిమ్ కుక్ తెలివైన ప్రణాళికగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. కాల్ షెడ్యూలింగ్ ఆప్షన్.. అచ్చం జూమ్, టీమ్స్‌లను పోలి ఉండటం గమనార్హం.

మీరు ఆండ్రాయిడ్ లేదా విండోస్ పరికరాన్ని ఉపయోగిస్తూ యాపిల్ డివైజ్ కలిగి ఉన్న స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులను కలిగి ఉంటే.. వారు టెక్స్ట్, ఈమెయిల్, వాట్సాప్ లేదా క్యాలెండర్ ఆహ్వానం ద్వారా ఫేస్‌టైమ్ కాల్‌కు లింక్‌ను పంపిస్తారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే, అది మీ బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులను కూడా తమ వైపు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న యాపిల్.. వారికోసం ఇటీవలే యాపిల్ టీవీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed