కేంద్ర జలశక్తి మంత్రితో ఏపీ టీడీపీ నేతలు భేటీ

by srinivas |   ( Updated:2021-08-31 06:56:15.0  )
jal-sakthi
X

దిశ, ఏపీ బ్యూరో: వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు కలిగే ప్రయోజనాలను ఆయనకు వివరించారు. కరువు జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లా రైతాంగానికి వెలిగొండ ప్రాజెక్టు అత్యవసరమని కేంద్రజలశక్తి మంత్రికి చెప్పుకొచ్చారు. మూడు జిల్లాల ప్రజల దాహర్తిని తీర్చేందుకు వెలిగొండ ప్రాజెక్టు కీలకమని వివరించారు. ఇటీవల కేంద్రం తమ గెజిట్ నోటిఫికేషన్‌లో వెలిగొండను చేర్చకపోవడంతోనే తెలంగాణ బలంగా వాదనలు వినిపిస్తోందని వారు వివరించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను విభజన చట్టంలో ఉందని… అలాంటి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ కొందరు ఆరోపించడాన్ని ఖండించారు.

వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ప్రకాశం, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బృందం కోరింది. ప్రకాశం జిల్లా కరువు పరిస్థతిని, జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను సవివరంగా కేంద్రమంత్రికి టీడీపీ నేతలు వివరించారు. మరోవైపు వెలిగొండకు అనుమతి, నిధులు కేటాయించవద్దని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడాన్ని టీడీపీ నేతలు తప్పుబట్టారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు దామచర్ల జనార్దన్, ఉగ్రనరసింహారెడ్డిలు ఉన్నారు.

Advertisement

Next Story